మాయ మాటలు విని మోసపోయాం...లగచర్ల రైతుల ఆవేదన
వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ, పోలీస్ అధికారులపై జరిగిన దాడి వెనుక రాజకీయ కుట్ర ఉంది అని పోలీస్ అధికారులు, ప్రభుత్వం చెబుతుంది.
దిశ ప్రతినిధి వికారాబాద్ : వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ, పోలీస్ అధికారులపై జరిగిన దాడి వెనుక రాజకీయ కుట్ర ఉంది అని పోలీస్ అధికారులు, ప్రభుత్వం చెబుతుంది. బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఇందులో మా తప్పు ఏమీలేదు, దాడికి ఎవరు ప్రోత్సహించలేదు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం తప్ప..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే ఈ దాడి జరిగిందని అంటున్నారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో గత గురువారం పరిగి జైలు దగ్గర లగచర్ల బాధిత రైతులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో రైతులు వారి ఆవేదన వ్యక్తం చేశారు. బోగమోని సురేష్ చెప్పిన మాయ మాటలు విని మోసపోయామని, చట్టపరంగా వెళ్లాల్సింది పోయి కలెక్టర్ పై దాడి చేయడంతో మా గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందరూ బాగానే ఉన్నారు మా పరిస్థితి ఏమిటి..?
సురేష్ తాను రాజకీయంగా హైలెట్ అవ్వడానికి మాత్రమే మమ్మల్ని ముందు ఉంచి రెచ్చగొట్టాడు. వాడి వల్లే మా ఊరికి చెడ్డ పేరు వచ్చింది. సురేష్ మమ్మల్ని నమ్మించి మోసం చేసిండు. తాను చెప్పినట్లు విని కొంతమంది తాగి వచ్చి కలెక్టర్ పై దాడి చేశారు. మా గ్రామానికి చెందిన బ్యాగారి యాదయ్య అనే యువకుడికి అమ్మ నాన్న ఎవరూ లేరు. భూమి కూడా లేదు, కానీ తాగిన మైకంలో రాళ్లతో కార్లపై దాడి చేసి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఈ ఘటనతో రాష్ట్ర ప్రజలు మొత్తం మమ్మల్ని దోషులుగా చూస్తున్నారు. నిజానికి మేము బాధితులం. మాకు ఆ భూములు తప్ప వేరే ఆధారం లేదు. ఆ దాడికి రైతులకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు మా భూములు కాపాడేది ఎవరు..? పోలీసులు అధికారులు మమ్మల్ని దోషంగా చూస్తున్నారు అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో లగచర్ల రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.