కోట్లు విలువజేసే భూమికి ప్రజాప్రతినిధులే కన్నం.. సీఎంవోకు చేరిన వ్యవహారం

రంగారెడ్డి జిల్లాలో ఖాళీ జాగా కనిపిస్తే ప్రజాప్రతినిధులకు పండుగే.. అటు అధికారులకూ సంతోషమే.

Update: 2024-11-16 02:23 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లాలో ఖాళీ జాగా కనిపిస్తే ప్రజాప్రతినిధులకు పండుగే.. అటు అధికారులకూ సంతోషమే. ఏ పార్టీలు అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలకు అండగా ఉండేందుకు ప్రజాప్రతినిధులు గేమ్​ఆడుతుంటారు. ఆ గేమ్‌లో వ్యక్తిగత ప్రయోజనాలు మెండుగా ఉంటాయని అర్థమవుతుంది. పార్టీలు మారినప్పుడు ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారానికే అధికార పార్టీ వైపు ఉంటున్నట్లు ముచ్చట్లు చెబుతుంటారు. కానీ ఆసలు బాగోతం మరొకటి అనే సంగతి ప్రజలకు తెలియకపోవచ్చు. ఇలా పార్టీలు మారినప్పుడల్లా అక్రమంగా కబ్జాలు చేసిన భూములను కాపాడుకోవడానికి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తారు. ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి.. వ్యక్తిగత అవసరాలకే ప్రాధాన్యమిస్తూ పార్కుల స్థలాలను కబ్జాలు చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదులిస్తే పట్టించుకునే పాపాన పోవడం లేదు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా బాలాపూర్​ మండలం బడంగ్​పేట్, ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపాలిటీల్లో నడుస్తోంది.

ఇదండీ సంగతి..

పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా పార్కులు ఉంటే తప్పా అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు పార్కులను కాపాడుకోవాలని ఆలోచనతో పనిచేయాలి. కానీ పంచాయతీ లేఅవుట్ల చేసేటప్పుడు పార్కుల కోసం స్థలాలు వదిలేసి ఫ్లాటింగ్ చేశారు. అయితే ఆ ఫ్లాటింగ్ విధానం క్రమబద్ధంగా లేకపోవడంతో అక్రమార్కులకు పార్కులను కబ్జా చేసుకునే అవకాశం వచ్చింది. దీంతో బడంగ్​పేట్​కార్పొరేషన్​ పరిధిలోని 31వ డివిజన్​ పరిధిలోని సర్వే నంబర్​ 743, 746, 747, 748, 749, 750లో సుమారు 50 ఎకరాల్లో ఎన్నో ఏండ్ల కింద పంచాయతీ లేఅవుట్ ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 5100 గజాల స్థలాన్ని పార్కులు, ఇతర అవసరాల కోసం కేటాయించారు. అలాంటి స్థలాలను పంచాయతీ తర్వాత మున్సిపాలిటీ రికార్డులో నమోదు చేయకుండా వదిలేశారు. అంతేకాకుండా ఆ భూమిని నాలాగా కన్వర్షన్​ చేయకపోవడంతో పక్కనున్న పట్టా భూముల మాదిరిగానే పట్టా చేయించుకున్నారు. బడంగ్​పేట్​ కార్పొరేషన్​ పరిధిలోని భూమి వ్యవసాయ భూమిగా మారిపోవడం విడ్డూరంగా ఉంది. పట్టా భూమి చేసుకొని ఆగిపోకుండా 5100 గజాల స్థలంలో 23 ఫ్లాట్లు చేసి అమ్మకానికి పెట్టారు.

ఎలాంటి నాలా కన్వర్షన్​ లేకుండా ఫ్లాట్లుగా మార్చే అధికారం రియల్​ఎస్టేట్ వ్యాపారులకు ఉంటుందా..? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ ఫ్లాట్లను విక్రయించే అధికారం ఇస్తూ సబ్​ రిజిస్ట్రార్​రిజిస్ట్రేషన్లు చేశారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్​ రెవెన్యూలో నిర్మించి ఓ కన్వెన్షన్​హాల్​హెచ్ఎండీఏ ప్లాన్‌లో రోడ్లు, పార్కింగ్​ఏరియాలను స్థానిక ఆదిభట్ల మున్సిపాలిటీకి గిఫ్ట్​డీడ్​చేసింది. 24, డిసెంబర్​2021లో 668.31 గజాల రోడ్డును కూడా మున్సిపాలిటీకి గిఫ్ట్ డీడ్ చేశారు. అధికారికంగా సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయం అధికారులతో ధ్రువీకరించి 20644/2021 డాక్యుమెంట్​నంబర్‌ను కూడా మున్సిపాలిటీలో అందజేశారు. కన్వెన్షన్​హాల్​పూర్తయ్యే వరకు ఎలాంటి ఆక్రమణలు జరగలేదు. కానీ ఆ తర్వాత సర్వే నంబర్ 388, 389, 390ల్లో 668.31 గజాల స్థలం కన్వెన్షన్​యజమాని కబ్జా చేశారు. ఈ విధంగా బడంగ్‌పేట్, ఆదిభట్ల మున్సిపాలిటీల్లో గజానికి రూ.30 వేలకు పై మాటే ఉంటుంది. ఈ విధంగా కోట్ల విలువైన భూమికి ప్రజాప్రతినిధులే కన్నం పెడితే ప్రభుత్వాలను కాపాడే నాథుడేడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కాపాడే వాడే కబ్జాలు చేస్తే ఎలా..?

బడంగ్‌పేట్ కార్పొరేషన్​ పరిధిలోని 31వ వార్డు కార్పొరేటర్‌గా​స్వయాన మేయర్​పారిజాత నర్సింహారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ ప్రాంతంలోనున్న మున్సిపాలిటీ భూమి మాయమవుతున్నప్పుడు అధికారులను ఆదేశించి విచారణ చేయాల్సిన బాధ్యత వాళ్లకు లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ విధంగా కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైనప్పుడు మౌనంగా ఉండడంపై కార్పొరేషన్‌లోని ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. ఆ కబ్జాల్లో వాళ్ల పాత్ర ఏమైనా ఉందా? అనే ప్రచారం సాగుతున్నది. ఈ విషయం స్థానిక కార్పొరేషన్​అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో సీఎంవోకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. త్వరలోనే కబ్జాకు గురైన స్థలంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Tags:    

Similar News