రాష్ట్రంలో గతితప్పిన శాంతి భద్రతలు
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. శాంతి భదత్రలు గతి తప్పాయని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు.
దిశ, గండిపేట్ : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. శాంతి భదత్రలు గతి తప్పాయని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, దీనికి ప్రధాన కారణం సీఎం రేవంత్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసేదంతా చేసి శాంతిభద్రతలపై రివ్యూ చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. గురువారం లా అండ్ ఆర్డర్ ఏమైందని ప్రశ్నించారు. నిన్న ఆపి ఉంటే శాంతి భద్రతల సమస్యలు వచ్చేవి కావని వివరించారు. ఇంకా ఎవరిమీద దాడి చేయాలని రివ్యూలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఖమ్మంలో దాడి చేసిన వారిని పదిరోజులు అయినా ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారికి రాచమర్యాదలు చేశారని ఆరోపించారు. సీఎం బజారు భాష మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు అరికెపూడి గాంధీ, దానం నాగేందర్‌లు ఇలా ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.
రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తే దాడులు చేయమని చెబుతున్నారని అన్నారు. ఇదే హౌస్ అరెస్టు నిన్న గాంధీని చేస్తే ఇంత పెద్ద గొడవ జరిగేదా అని ఆయన విమర్శించారు. ఇది రేవంత్ రెడ్డి ఎజెండా.. ఆయన చేయించిన దాడి గానే చూస్తామని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో కూడా ఇలాంటి పాలన చూడలేదని, ఎమర్జెన్సీని మించిన పాలన నేడు రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు. తమ నేతలపై దాడులు సీఎం ప్రేరణతోనే జరుగుతున్నాయన్నారు. డీజీపీ చాలా పెద్ద పదవిలో ఉన్నారని, జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పోలీసులను పట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు. పోలీసులు విచక్షణతో, న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. రాహుల్ గాంధీ అమెరికాలో లెక్చర్ ఇస్తున్నారని, ముందు కాంగ్రెస్ పార్టీ నేతలను రాజ్యాంగబద్దంగా వ్యవహరించమని చెప్పాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి, గాంధీ ల మధ్య గొడవగా చిత్రీకరించారని అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన కాదు లా అండ్ ఆర్డర్ సమస్యగా సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై తాం మాట్లాడితే డైవర్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా సమయం వచ్చినప్పుడు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. తమకు దాడులు కొత్తకాదని, ఉద్యమంలో ఎన్నో దాడులు ఎదుర్కొన్నామన్నారు. ఎన్ని రాళ్లు వేసినా ఆ రాళ్లను మా ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశంగా వాడుకుంటామన్నారు. 16వ ఆర్థిక సంఘం ముందు రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టి వాదన వినిపించామన్నారు. ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా తమ సంకల్పం కోసం పనిచేస్తామన్నారు. గృహ నిర్బంధాలు చేస్తుంటే పోలీసుల గౌరవం పోకూడదని సహకరిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రాంత ప్రజలపై రేవంత్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తున్నారని, కేసీఆర్ హైదరాబాద్ ప్రజలు అందరూ తమ వారే అనుకున్నారన్నారు. నీవు డిఫెన్స్ లో ఉన్నప్పుడల్లా కొత్త డ్రామాలు చేస్తావని, పీఏసీ చైర్మన్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందన్నారు. పీఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ కాదు సెలక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి అని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. అందరినీ వెంటనే విడుదల చేయాలని కోరారు. కౌశిక్ రెడ్డిని గాంధీ రెచ్చగొట్టారని, దానికి సమాధానం చెప్పారన్నారు.