అనంతగిరి అడవిలో వరుసగా జింకల మృతి
జింకలకు నిలయంగా చెప్పుకునే అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ లో వాటి ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది.
ప్రశ్నార్థకంగా వన్యప్రాణుల పరిరక్షణ
దిశ, ప్రతినిధి వికారాబాద్: జింకలకు నిలయంగా చెప్పుకునే అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ లో వాటి ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది. నామమాత్రంగా అడవులను కాపాడడం తప్ప వన్యప్రాణులను సంరక్షణ తమ పని కాదని అనుకుంటున్నారో ఏమో.. ఫారెస్ట్ అధికారులు ఆ దిశంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో జింకలు వరుసగా మృత్యువాత పడుతున్నా.. వాటి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జంతు, ప్రకృతి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో అరుదైన పక్షులు, దుప్పులు, కొండ గొర్రెలు, సారంగులు లాంటి అరుదైన జాతులు అంతరించిపోతున్న పరిస్థితి నెలకొంది.
జింకలపై శునకాల దాడి..
అనంతగిరి అడవిలో గత నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు జింకలు మృత్యువాత పడ్డాయి. ఇటీవల ఓ జింక కుక్కల దాడిలో మృతి చెందగా, మరో జింక అనంతపద్మనాభ స్వామి ఆలయం ప్రధాన గుండంలో పడి మృతి చెందింది. కనీసం అనంతగిరి ప్రధాన రహదారిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. ఇటీవలే జిల్లా నూతన కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్పినట్లుగా తీసుకుంటున్న జీతానికి తగ్గట్టు పని చేసి వన్య ప్రాణులను రక్షించే దిశగా ఇకనైనా ఫారెస్ట్ అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తారో లేదో వేచిచూడాలి.