పైసలు ముడితేనే పని? అక్రమ అధికారులపై చర్యలు తీసుకోవాలని వెల్లువెత్తుతున్న డిమాండ్

ఓ వైపు విమర్శలు, మరోవైపు తీవ్ర ఆరోపణలు. అయినా అనే వారు అంటూనే ఉంటారు, మనం చేయాల్సిన పనిలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నట్లుగా శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారు.

Update: 2024-07-06 02:13 GMT

దిశ, శేరిలింగంపల్లి: ఓ వైపు విమర్శలు, మరోవైపు తీవ్ర ఆరోపణలు. అయినా అనే వారు అంటూనే ఉంటారు, మనం చేయాల్సిన పనిలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నట్లుగా శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇందులో ఈ శాఖ, ఆ శాఖ అనే తేడాలేదు. అవినీతిలో తాము మాత్రం తక్కువ కాదంటూ ఓ శాఖతో మరో శాఖ పోటీపడుతున్నట్లుగా ఉంది. అనేవాళ్లు అంటూనే ఉంటారు..మనం చేసే పని చేసేస్తూ పోవాల్సిందే అని ఓ పెద్ద సార్ సింపుల్ లాజిక్ చెప్పారట. ఇంకేముంది సారే అంతమాట అన్నాక మనకెదురేముంది అని జీహెచ్ఎంసీ సిబ్బంది రెచ్చిపోతున్నారు.

ఏసీబీ కలకలం..

శేరిలింగంపల్లి జోన్ పరిధిలో ఏసీబీ సోదాలు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికారి. అంటూ గురువారం శేరిలింగంపల్లిలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏసీబీకి చిక్కింది ఎవరు..? ఏ సెక్షన్‌లో ఏసీబీ దాడులు జరిగాయి..? టీపీఎస్‌లోనా..? ఇంజినీరింగ్ లోనా..? రెవెన్యూలోనా..? అన్న చర్చలు జోరుగా సాగాయి. ఒక్కో సెక్షన్‌లో ఒక్కో అధికారి గూర్చి పూర్వాపరాలు, వారు చేసిన, చేస్తున్న అవినీతి చిట్టా..ఎవరిపై ఏసీబీ దాడులు చేసే ఆస్కారం ఉంది, ఇలా అనేక అంశాలపై మీడియా సర్కిల్‌లో జోరుగా ఊహాగానాలు సాగాయి. అధికారులు, కిందిస్థాయి సిబ్బంది పనితీరు, వారి అవినీతి వ్యవహారాలు చర్చనీయాంశం అయ్యాయి. అయితే కాసేపటికి ఏసీబీ దాడులు శేరిలింగంపల్లిలో కాదు అన్న విషయం తెలిసాక అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అసలు శేరిలింగంపల్లి జోనల్ జీహెచ్ఎంసీపై ఏసీబీ రైడ్స్ చేసేంత అవినీతి జరుగుతుందా..? అన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.

అవినీతిలో అన్ని శాఖలు..

జీహెచ్ఎంసీ జోనల్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ, ఎంటమాలజీ, బర్త్ అండ్ డెత్, ట్రాన్స్‌పోర్ట్, ట్రేడ్, స్ట్రీట్ లైట్స్, బయోడైవర్సిటీ, స్వయం సహాయక సంఘాలు, ఇంజినీరింగ్, యానిమల్ అస్బెండ్రీ, ఫైర్ సేఫ్టీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, ఆడిట్, సీడబ్ల్యూఓ శాఖలు ఉంటాయి. వీటిలో జనాలతో సత్సంబంధాలు ఉండి రెగ్యులర్‌గా పనులు ఉండేవి కొన్ని మాత్రమే. మిగతా శాఖల పరిధిలో ఎన్ని పనులు ఉన్నా జనాలకు అంతగా టచ్‌లో ఉండరు. కానీ కనిపించని ఆదాయం వెనకేసుకుంటారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంజినీరింగ్ శాఖపై ఇటీవల ఆరోపణలు రాగా ఆ పెద్ద సార్ ఓ కేంద్ర మంత్రి పీఏతో ఫోన్ చేయించారు అంటే ఆయన రేంజ్ ఏంటో ఇట్టే అర్థం అవుతుంది. ఇక మరో శాఖలో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది ఏకంగా ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తున్నా..మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అని చెప్పుకు తిరగడం వారికి అద్దంపడుతుంది. కేవలం వీరు మాత్రమే కాదు దాదాపు అన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది.

గతంలో జీహెచ్ఎంసీలో ఏసీబీ దాడులు..

శేరిలింగంపల్లి సర్కిల్‌-20 కార్యాలయంలో 2020లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ యాదయ్య, అసిస్టెంట్‌ సాయిలు ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. 2022 ఏప్రిల్ 21న పట్టణ ప్రణాళికాధికారి నరసింహ రాములపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రతీ రెండు సంవత్సరాలకు ఓసారి శేరిలింగంపల్లి జోనల్ పరిధిలో ఐటీ రైడ్స్ సాగుతున్నాయి. తాజాగా గురువారం కూడా ఏసీబీ అధికారులు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఏసీబీ అధికారులు తనిఖీలకు వచ్చారన్న సమాచారంతో జోనల్ కార్యాలయం దాదాపు ఖాళీ కుర్చీలతో దర్శనం ఇచ్చింది. ఏదేమైనా అవినీతి అధికారుల భరతం పట్టాల్సిన అవసరం ఉందని, శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో తిష్టవేసిన లంచగొండులపై ఏసీబీ దృష్టిపెట్టాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.


Similar News