దిశ, రంగారెడ్డి ప్రతినిధి/అబ్దుల్లాపూర్‌మెట్: దేశంలో పౌర, ప్రజాస్వామిక హక్కులపై పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. పార్టీ రాష్ట్ర మూడో మహాసభలను రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆన్‌లైన్ ద్వారా సీతారాం ఏచూరి హాజరై మాట్లాడారు. బీజేపీ.. మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఒక విశాల ఐక్య సంఘనల ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ఉద్యమాలను బలపర్చడం ద్వారానే ఇది సాధ్యమని తెలిపారు. ఇందులో భాగంగా వామపక్షాలు బలపడాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చడమే లక్ష్యమని బీజేపీ నేతలు ప్రకటించే అవకాశం సైతం లేకపోలేదని తెలిపారు. బీజేపీ చర్యలు, విధానాలకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు బలపడుతున్నాయని తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతాంగ ఉద్యమమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈసీ, సీబీఐ, ఈడీ, న్యాయ వ్యవస్థలను బీజేపీ తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటోందని విమర్శించారు. అంతకు ముందు అమరవీరుల స్థూపానికి పొలిట్ బ్యూరో సభ్యుడు బీబీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు హేమలత, పుణ్యవతి, అరుణ్ కుమార్, తదితరులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జ్యోతి, ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, సాయిబాబా, జాన్ వెస్లీ, పోతినేని సుదర్శన్ రావు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, కార్యవర్గ సభ్యులు యాదయ్య, సామేల్, మధుసూదన్ రెడ్డి, జగదీశ్, శోభన్, చంద్రమోహన్, రాజు తదితరులు పాల్గొన్నారు.