చదువుల తల్లికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూత
రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన మెదక్ పల్లి గ్రామపంచాయతీలో దరువుల జంగమ్మ- జంగయ్య అనే దంపతులకు ముగ్గురు కుమార్తెలు.
దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన మెదక్ పల్లి గ్రామపంచాయతీలో దరువుల జంగమ్మ- జంగయ్య అనే దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు చిన్నకుమార్తెల పెళ్లిళ్లు కాగా, పెద్ద కుమార్తె మంజుల తల్లిదండ్రులను ఒప్పించి ఎల్ఎల్ బీతో పాటు ఎల్ఎల్ఎమ్ పూర్తి చేసింది. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతోంది. పుట్టుకతోనే రెండు కాళ్లు చచ్చుపడిపోయి, నడవలేకుండా ఉన్న వికలాంగురాలైన మంజుల ఏనాడు కూడా ఎల్ఎల్ బి చదవడానికి వెనుకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసమే ఆమె బలమని నిరూపించింది. చదువుకు కులమతాలు, ధనికా పేద ఏమీ చేయలేవని నిరూపించింది. పేదరికం మాత్రం ఆ కుటుంబానికి శాపంగానే మారింది.
పూరి గుడిసెల్లో ఉండి కాలం వెళ్లదీస్తుంటే, ఉన్నకాస్తఇల్లు వర్షాలకు నేల మట్టమయింది. ఎస్సీ కాలనీలోనీ కమ్యూనిటీ హాల్లో నివాసం ఉంటూ, ఇంటి పరిసరాల స్కూలు పిల్లలకు, ఇతరులకు చదువు చెబుతూ ఆదర్శంగా నిలిచింది. ఈ నోట, ఆ నోట ఈ విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి వెళ్లడంతో అణగారిన వర్గాల్లో పుట్టిన మంజులకు భీమ్ హోమ్ పథకంలో భాగంగా ఇల్లు నిర్మిస్తామని గతంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఆర్ఎస్ పి కోరిక మేరకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ కు సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన జెడ్పీటీసీ మంజుల ఇంటికి ఆదివారం చేరుకొని అసంపూర్తిగా నిలిచిపోయిన ఇల్లును మొత్తం తన ట్రస్టు ద్వారా స్లాబ్ వేసి పూర్తిగా చేయిస్తానని వికలాంగురాలైన మంజులకు, ఆమె తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. నేను ఉన్న మీరు ఎవరూ భయపడద్దని ధైర్యం చెబుతూ హామీ ఇచ్చారు. చలించిపోయిన నేతలు ఉప్పల వెంకటేష్ హామీ ఇచ్చిన వెంటనే పక్కనే ఉన్న తలకొండపల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్ 50 వేలు, తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతయ్య 50 వేలు, తెలంగాణ ఉద్యమ గాయని ఫోక్ సింగర్ గంగ పదివేల రూపాయల విరాళాలను అందిస్తామని బాసటగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు, మెదక్ పల్లి ఉపసర్పంచ్ నరేష్ అజీజ్, కో ఆప్షన్ నెంబర్ ఇమ్రాన్, రొయ్యల యాదయ్య, నాయకులు డేవిడ్, శేఖర్, విటల్, విజయ్, శేఖర్ యాదయ్య, శృతిలయ అకాడమీ చైర్మన్ చిత్తరంజన్ దాస్, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.