Occupied : దోర్నాల పల్లి చెరువుకు దారేది..?

రైతులు వ్యవసాయం చేసుకునేందుకు నీటి కొరత లేకుండా

Update: 2024-07-22 12:36 GMT

దిశ,దోమ:రైతులు వ్యవసాయం చేసుకునేందుకు నీటి కొరత లేకుండా భూగర్భ జలాలు కాపాడుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి చెరువులకు నక్ష బాటలు కబ్జాకు గురి కావడంతో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారుతుంది. మండల పరిధిలోని దోర్నాల పల్లి గ్రామంలోని పోతిరెడ్డి చెరువుకు, రైతుల పొలాలకు వెళ్లే తాతల కాలం నాటి నక్ష బాటను హైదరాబాద్ కు చెందిన వ్యక్తి చుట్టుపక్కల భూమిని కొనుగోలు చేసి నక్ష బాటను ఆక్రమించాడు. దీంతో చుట్టుపక్కల రైతులు, గ్రామస్తులు చెరువుకు వెళ్లే నక్ష బాటను విడిపించి తమకు న్యాయం చేయాలని సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.మేము పుట్టక ముందు నుంచి ఈ నక్షబాట ఉండేదని, ఇటీవల కొంతమంది కొనుగోలు చేసి నక్ష బాటకు అడ్డంగా గేటుని ఏర్పాటు చేసి, పొలం చుట్టూ కడ్డీలు పాతి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారని రైతులు తహసీల్దార్ ముందు మొరపెట్టుకున్నారు.

దోర్నాల పల్లి గ్రామ శివారులోని 45 సర్వే నెంబర్ లో హైదరాబాద్ కు చెందిన వ్యక్తి పొలం కొనుగోలు చేసి నక్ష బాటను తన పొలంలోకి ఆక్రమించి ప్రహరీ ఏర్పరచుకొని పెద్ద గేటు పెట్టి పోతిరెడ్డి చెరువుకు, చుట్టుపక్కల పొలాల రైతులకు దారి లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు తెలిపారు . చెరువుకు వెళ్లే నక్ష బాట కబ్జాకు గురి కావడంతో చెరువు కింద వ్యవసాయం చేసే రైతులు జీవనాధారం కోల్పోతున్నారు.కనీసం మూగజీవాలకు చెరువులో నీరు త్రాగడానికి కూడా దారి లేకుండా పోయిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తహసిల్దార్ పురుషోత్తం వెంటనే స్పందించి సర్వేయర్ తో సర్వే చేయించి తదుపరి చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రమోద్ రెడ్డి , శ్రీనివాస్,రామ్ రెడ్డి , నాగేందర్ రెడ్డి, చంద్ర నాయక్ ,సురేష్ గ్రామస్తులు,రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News