వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలి

వర్షాలు కురుస్తున్నందున ప్రజలు, రైతులు అన్ని వర్గాల వారు అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు.

Update: 2024-09-04 12:44 GMT

దిశ, శంకర్పల్లి : వర్షాలు కురుస్తున్నందున ప్రజలు, రైతులు అన్ని వర్గాల వారు అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. శంకర్పల్లి మండలం రావులపల్లి కలాన్, ఫతేపూర్ రైల్వే వంతెన వద్ద వాహనదారుల ఇబ్బందులను బుధవారం ఎంపీ కొండ విశేశ్వర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు పడినప్పుడే ప్రభుత్వాలు, అధికారులు చేసిన తప్పులు బయటపడతాయని స్పష్టం చేశారు. రైల్వే వంతెన నిర్మించడం వల్ల క్రాసింగ్ లెవెల్ లేకపోవడంతో వరద నీరు బయటకు వెళ్లలేక పోతుందని, దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఇది అధికారులు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాల్సిన విషయమని స్పష్టం చేశారు.

    వంతెన నిర్మించాం రోడ్డు వేశాం అంటే సరిపోదని, ఫ్లై ఓవర్ వంతెన నిర్మించేటప్పుడే సర్వీస్ రోడ్డు నిర్మించాలని, వర్షం కురిసిన సమయంలో ఆ నీరంతా వెళ్లే విధంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద సిమెంట్ రోడ్డు వేశారని, నీరు వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేయకపోవడంతో నీరు నిలబడి వాహనాలు వెళ్లడం లేదన్నారు. ఇదంతా అధికారుల ముందుచూపు లేకపోవడమేనని స్పష్టం చేశారు. రైల్వే లెవెల్ క్రాసింగ్ దాటిన తర్వాత రైతుల పొలాలు 150 ఎకరాలు ఉంటాయని, ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించిన తర్వాత రైల్వే అధికారులు లెవెల్ క్రాసింగ్ మూసివేశారని, దీంతో వర్షపు నీరు వెళ్లకపోగా రైతులు కూడా పంట పొలాలకు వెళ్లలేకపోతున్నారని ప్రజలు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆయన స్పందించారు.

    వర్షపు నీరు వెళ్లేందుకు మార్గం చేసే విధంగా తాను కృషి చేస్తానని, రైల్వే అధికారులతో మాట్లాడి లెవెల్ క్రాసింగ్ ను తెరిపించి రైతులను పంట పొలాలకు వెళ్లే ఏర్పాట్లు చేయించడంతోపాటు, అవసరమైతే పట్టాల కింద నుంచి పైప్ లైన్ వేసి వర్షపు నీరు వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేస్తానన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని హామీ ఇచ్చి హామీలు పూర్తి చేయలేదని విమర్శించారు. పంట రుణాలు కూడా కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే మాఫీ అయ్యాయని, మిగతా 70 శాతం మంది రైతుల రుణాలు మాఫీ కాలేదని అవి ఎప్పటి వరకు చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో పెద్ద మొత్తంలో వర్షం నష్టం జరగలేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వర్షాల వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తుందని, త్వరలోనే కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటిస్తుందని స్పష్టం చేశారు.

రావులపల్లి కలాన్ రోడ్డును పరిశీలించిన ఎంపీ

వికారాబాద్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రావులపల్లి కలాన్ గ్రామానికి వెళ్లే రోడ్డు చెరువును తలపించేదిగా ఉండడంతో గ్రామస్తులు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కి తమ సమస్యను చెప్పుకోవడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. రోడ్డును పరిశీలించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల సమక్షంలోనే ఫోన్ చేసి రావులపల్లి కలాన్ గ్రామానికి కి వెళ్లే రోడ్డు ఎందుకు ఆలస్యం అవుతుందని అడిగి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

    మూడు కిలోమీటర్ల దూరానికి 50 లక్షలు మంజూరయ్యాయని అవి సరిపోవని తెలపడంతో ఎంతవరకు ఆ నిధులతో రోడ్డు అవుతుందో అంతవరకు ఏర్పాటు చేయాలని ఎంపీ ఫోన్లో ఆదేశించారు. దీంతో గ్రామస్తులు చేవెళ్ల మాజీ ఎంపీటీసీ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రాములు గౌడ్, వాసుదేవ్, కన్నా సురేష్, కౌన్సిలర్ రాములు, నాయకులు గోవింద్ రెడ్డి, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News