పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ నారాయణరెడ్డి
ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లను

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ, సంబంధిత శాఖల అధికారులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పదవ తరగతి పరీక్షల నిర్వహణకు చేపట్టాల్సిన అన్ని ఏర్పాట్ల పై విద్యాశాఖ, సంబంధిత ఇతర శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, ఆరోగ్య శాఖ ప్రతి సెంటర్ లోఏఎన్ఎంలను అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని అన్నారు.
జిల్లాలో 249 పరీక్ష కేంద్రాలలో 51,766 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నందున RTC వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి సకాలంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యే విధంగా బస్సులు నడిచే విధంగా చర్యలు చేపట్టాలని, విద్యుత్ శాఖ తమ పరిధిలోని సెంటరలలో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండే విధంగా చూడాలని తెలిపారు. జిల్లాలోని ఆర్డీవోలు, ఎంఆర్ఓలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లు పరీక్ష కేంద్రాలలో గల సౌకర్యాలను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు త్రాగునీరు, తగిన ఫర్నీచర్ కేంద్రాల్లో ఉండే విధంగా ఈ రెండు రోజుల్లో తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తెలియజేశారు.