‘నేను మర్డర్ చేయబోతున్న బెయిల్ ఇప్పించు..’ పట్టపగలే నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం అయిన హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు మరోసారి సంచలనంగా మారుతున్నాయి. నిన్న పాత కక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపారు.

Update: 2025-03-24 07:03 GMT
‘నేను మర్డర్ చేయబోతున్న బెయిల్ ఇప్పించు..’ పట్టపగలే నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య
  • whatsapp icon

దిశ, చార్మినార్​: నడిరోడ్డుపై న్యాయవాది, సీనియర్​ కాంగ్రెస్​నాయకుడిపై కత్తితో దాడి చేసి అతికిరాతకంగా హత్య చేసిన ఘటన ఐఎస్​సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. వివరాలలోకి వెళితే.... తుమ్మలూరు ప్రాంతానికి చెందిన ఎర్రబాపు ఇజ్రాయిల్​(55) కు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎర్రబాపు ఇజ్రాయిల్ వృత్తి రీత్యా న్యాయవాది, మహేశ్వరం నియోజకవర్గం సీనియర్​ కాంగ్రెస్​ నేత. 10 ఏళ్ల క్రితం సంతోష్​నగర్‌లోని న్యూ మారుతీనగర్​ ప్రాంతానికి ఎర్రబాపు ఇజ్రాయిల్​కుటుంబం ఓ అపార్ట్​మెంట్‌లో ఒక ఫ్లాట్​కొనుగోలు చేసి ఇక్కడే నివసిస్తున్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన దస్తగిరి (50) స్థానికంగా ఎలక్ట్రిషన్​ పనులు చేస్తూ అందరికి సుపరిచితం.

నేను మర్డర్ చేయబోతున్న.. బెయిల్ ఇప్పించు..

ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం దస్తగిరి న్యాయవాది అయిన ఇజ్రాయిల్​ దగ్గరికి వెళ్లాడు. నేను అతి త్వరలో ఓ భార్యభర్తలను చంపబోతున్నానని, అందులో తనకు త్వరగా బెయిల్ ఇప్పించాలని ముందస్తుగా వేడుకున్నాడు. దానికి సదరు న్యాయవాది ససేమిరా అన్నాడు. తనను అలాంటి బ్రోకర్​ పనులు, ఇల్లీగల్​పనులు చేయనని తెగేసి చెప్పాడు. అయినప్పటికీ న్యాయవాదికి ఫోన్లు, మెసేజ్ల ద్వారా హెల్ప్​ చేయాలని లేకపోతే చంపేస్తానని ఎలక్ట్రిషన్​దస్తగిరి బెదిరించసాగాడు. దీంతో దస్తగిరి ఫోన్​నెంబర్​బ్లాక్​చేయడంతో పాటు స్థానిక పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. న్యాయవాది ముందే దస్తగిరిని పోలీసులు పిలిపించి రెండు దెబ్బలు వేసి హెచ్చరించి పంపించి వేశారు.

ఆ మహిళ కుటుంబం కనిపించకపోవడంతో..

ఈ ఘటనతో దస్తగిరి మరింత కక్ష్య పెంచుకున్నాడు. అంతేకాదు.. తాను చంపేస్తానన్న భార్యభర్తలు కనిపించకుండా పోవడానికి సదరు న్యాయవాది​కారణమని భావించాడు. వాళ్లను ఎక్కడ దాచావో చెప్పాలని మళ్లీ బెదిరించసాగాడు. అతని కక్ష్య పెంచుకున్న దస్తగిరి ఎలాగైనా చంపాలని పథకం పన్నాడు. దస్తగిరి గత 10 రోజులుగా ఇజ్రాయిల్​ కదలికలపై ఆరాతీయసాగాడు. వాకింగ్‌కు​ఎప్పుడు కారులో గ్రౌండ్​వరకు వెళ్లే ఇజ్రాయిల్ సోమవారం బైక్​పై వెళ్లాడు. తిరిగి బైక్​పై ఇంటి దగ్గరకు రాగానే అక్కడే కాపు కాచి ఉన్న ఎలక్ట్రిషన్ దస్తగిరి కత్తితో న్యాయవాదిపై విచక్షణా రహితంగా మూడు చోట్ల దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇజ్రాయిల్​అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐఎస్​సదన్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా దస్తగిరి చంపుదామనకున్న భార్య, భర్తలలో సదరు వ్యక్తి భార్యతో తనకు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే వారిని హతమార్చుదామన్న పథకం వేసినట్లు తెలుస్తోంది.

Similar News