PHC : కరీంపూర్ పీహెచ్సీ ఎక్కడ..?
మండల పరిధిలోని కరీంపూర్ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి ( PHC ) ఉందని ఆ గ్రామ ప్రజలకే తెలియదంట.
దిశ, కోట్ పల్లి : మండల పరిధిలోని కరీంపూర్ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి ( PHC ) ఉందని ఆ గ్రామ ప్రజలకే తెలియదంట.. అంతే కాదు ఆ దవాఖాన పేరుతో ఒక డాక్టర్, ఇద్దరు స్టాఫ్ నర్స్, ఒక ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్లు ఉన్నారని మండలంలో ఉన్న అధికారులకు తెలిసినా తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమో, నాయకుల నిస్సహాయతనో కాని ఆ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
2019 సంవత్సరంలో ఉమ్మడి బంటారం మండల పరిధిలో ఉన్న కరింపూర్ ( Karimpur) గ్రామాన్ని సెంటర్ చేసుకొని, రాంపూర్, కంకణలపల్లి, మద్గుల్ తండా, మోత్కుపల్లి, బార్వాద్, బర్వాధ్ తండా, నాగసన్పల్లి, నాగసాన్పల్లి తండా, బిరోల్, జిన్నారం, ఎంకెపల్లి గ్రామాలను కలిపి ఒక సెంటర్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆస్పత్రి ( Hospital ) నిర్మాణం చెయ్యాలని ప్రజా ఆరోగ్యం సౌకర్యం దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. మారుతున్న రాజకీయ పరిణామాల, దృష్ట్యా 4 నుంచి 5 సంత్సరాలు గడుస్తున్నా కాని ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అయినా ఆస్పత్రి నిర్మాణం కొనసాగుతుందని అక్కడి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో వికారాబాద్ జిల్లా ఏర్పాటు కావడంతో కొత్తగా కోట్ పల్లి మండలం ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కొనసాగించి, ప్రస్తుతానికి వైద్య సేవలు అందజేస్తున్నారు. దీంతో 5 సంవత్సరాల క్రితం నిర్మాణ ప్రతిపాదనలో ఉన్న కరింపూర్ ఆస్పత్రి కనుమరుగు అయ్యింది. ప్రస్తుతానికి కోట్ పల్లి మండల కేంద్రంలో ఉన్న పలువురు సిబ్బంది కరింపూర్ ఆస్పత్రి పేరిట నియమించిన వారే.. ప్రస్తుతానికి వికారాబాద్ జిల్లాలోని ఆస్పత్రులు.. తాండూర్, వికారాబాద్ యూపీ ఎచ్ సీతో పాటు మండల పరిధిలో 24 గంటల పాటు అందుబాటులో ఉండే ఆస్పత్రులు అంగడి రాయచూర్, బాంబరస్పెట్, దోమ, కులక్చర్ల, మోమిన్పేట్, నవాబ్ పేటలు ఉండగా, కేవలం రోజు ఔట్ పేషన్ట్స్ చూసే జనరల్ ఆస్పత్రులు, మార్పలి, బంటారం, కోట్ పల్లి, చంగొమ్ముల, చిట్యాల, దరూర్, దౌత్ల్తాబాద్, జింగుర్తి, కరింపూర్, నగసమందర్ , నవాల్గా, పట్లూరు, పెద్దేముల్, పూడూరు, రామయ్యగూడ, సిద్దులూరు, యాలలలో ఉన్నాయి. ఈ విషయం పై సంబంధిత అధికారులను వివరణ కోరగా కరింపూర్ ఆస్పత్రి నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు కాని, ఇంకా ప్రభుత్వం నిధులు సమకూర్చలేదని చెప్పుకొస్తున్నారు.
బంటారం, పెద్దేముల్, మోమిన్ పేట్, కోట్ పల్లిలోఉన్న ఆస్పత్రుల్లో జనరల్ (ఒపి)వైద్యం మాత్రమే చేస్తున్నారు. అత్యవసరం ఉన్నా, రాత్రి ఇంటికి వెళ్లి తిరిగి మరుసటి రోజు ఆస్పత్రికి రావాల్సి వస్తుంది. పెద్దేముల్ పరిధిలో తాండూర్ జిల్లా ఆస్పత్రి అందుబాటులో ఉంది. మిగితా మండలంలో ఉన్న ప్రజలు జిల్లా ఆస్పత్రులకు ఇంచుమించు 50 కిలోమీటర్ల దూరాన ఉన్నారు. అలాంటి ఆస్పత్రులకు 24 గంటల సేవలను కొనసాగేలా చర్యలు తీసుకోవాలని, కరింపూర్ గ్రామంలో పేరుకు ఆసుపత్రి ఉన్నప్పటికి వైద్య సేవలు కాదు కదా, కనీసం ఒక సబ్ సెంటర్ కూడా లేకపోవడం వైద్య అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం, అధికారులు, నాయకులు స్పందించి కరింపూర్ ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపట్టి అక్కడి ప్రజలకు వైద్యసేవలను అందించే ప్రయత్నం చెయ్యాలని పలువురు ప్రజలు పేర్కొంటున్నారు.