నగర శివార్లలో 800 ఏండ్ల నాటి గణేశుని శిల్పం లభ్యం
An 800-year-old Ganesha sculpture was found on the outskirts of the city
నగర శివారులో ఔటర్ రింగ్ రోడ్‌కు ఆనుకొనివున్న పెద్ద గోల్కొండ గ్రామంలో కళ్యాణి చాళుక్యుల కాలపు గణేశ విగ్రహాన్ని గుర్తించినట్లు చరిత్రకారులు తెలిపారు. చరిత్ర పరిశోధకుడు డా.ఎస్. జై కిషన్ ఇచ్చిన సమాచారం మేరకు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్వాహకులు శ్రీరామోజు హరగోపాల్, బీవి భద్రగిరీశ్ శనివారం నాడు శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ గ్రామంలోని భగీరథ శివాలయం, ఆంజనేయాల్లోని చారిత్రక శిల్పాలను పరిశీలించారు.
శివాలయం ముందు మూడడుగుల వెడల్పు, నాలుగడుగుల ఎత్తు, రెండడుగుల మందంతో నల్లశానపు రాతిలో చెక్కిన గణేశుని రెండు చేతుల్లో దంతం, కుడుము ఉన్నాయని, తలపై చిన్న కిరీటం, లలాట హారం, ఉదర బంధం, నాగ యజ్ఞోపవీతం, బాహు వలయాలు కంకణాలు, కాళ్ళకు కడియాలు ధరించి, లలితాసనంలో కూర్చొని ఉన్నాడని తెలిపారు. ప్రతిమాలక్షణాన్ని అనుసరించి ఈ విగ్రహం, క్రీ.శ.12వ శతాబ్దికి చెందిన కళ్యాణీ చాళుక్య శిల్ప శైలికి అద్దం పడుతుందని తెలిపారు.
గణేశుని విగ్రహం పక్కన కాకతీయ స్తంభం, కప్పురాయి, శిఖర శిథిలాలు, గ్రామంలోని ఆంజనేయాలయంలో క్రీ.శ.13 వ శతాబ్దికి చెందిన చక్కటి ఉమామహేశ్వర శిల్పం, అద్భుతంగా అలంకరించిన నంది విగ్రహాలున్నాయని వీటిని శివాలయం నుంచి ఇక్కడికి తరలించారని స్థానికులు బాణాల శ్రీనాథ్, శివలింగం గౌడ్లు తెలిపారని వారు చెప్పారు.
పెద్దగోల్కొండలో గుర్తించిన గణేశ, ఉమామహేశ్వర, నంది విగ్రహాలు కళ్యాణీ చాళుక్య, కాకతీయుల కాలానికి చెందినవని, ఇవి హైదరాబాద్ నగర చరిత్రను మరో నాలుగు వందల సంవత్సరాల ముందుకు తీసుకెళ్తున్నాయని, చారిత్రక ప్రాధాన్యత గల ఈ శిల్పాల పైనున్న రంగులను తొలగించి, పీఠాలపై నిలబెట్టి, చారిత్రక వివరాలతో ఫలకాలను ఏర్పరచి, భద్రపరిచి భావితరాలకు అందించాలని శివనాగిరెడ్డి, హరగోపాల్, భద్రగిరీష్ గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.