టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు..అన్నదమ్ములు మృతి

టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ అన్నదమ్ములను విగత జీవులుగా మార్చింది.

Update: 2024-11-02 15:28 GMT

దిశ, కేశంపేట: టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ అన్నదమ్ములను విగత జీవులుగా మార్చింది. కేశంపేట మండల పరిధిలోని లేమామిడి గ్రామ శివారులో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్ ఢీకొని అన్నదమ్ములు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..కొత్తూరు మండలం కొడిచర్ల తండాకు చెందిన నేనావత్ రవి నాయక్ (21), రాకేష్ నాయక్(18) ఇద్దరు అన్నదమ్ములు.

ఈ మధ్యనే ట్రాక్టర్ ను కొనుగోలు చేశారు. సొంత పని నిమిత్తం అన్నదమ్ములు ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై కల్వకుర్తికి వెళుతుండగా లేమామిడి గ్రామ శివారులోని బ్రిడ్జి మలుపు వద్ద తలకొండపల్లి నుంచి బాలానగర్ కు పలుగు లోడుతో వస్తున్న టిప్పర్ (TS 07UF0969) ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కొడిచర్ల తండాకు చెందిన నేనావత్ బలరాం, చంద్రి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు కూడా ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి సీఐ నరహరి, ఎస్సై రాజ్ కుమార్ చేరుకుని మృతదేహాలను షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Similar News