Bank : 26 గ్రామ పంచాయతీలకు ఒకే బ్యాంక్...
బొంరాస్ పేట్ మండల కేంద్రంలో ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీఐ) (Sbi Bank) బ్యాంకు సేవలందిస్తుంది.
దిశ, బొంరాస్ పేట్ : బొంరాస్ పేట్ మండల కేంద్రంలో ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీఐ) (Sbi Bank) బ్యాంకు సేవలందిస్తుంది. ఈ ఒక్క బ్యాంకు ఉండడంతో, చాలామంది ఎస్బీఐ బ్యాంకులోనే ఖాతాలు తెరిచారు. 12 రెవెన్యూ గ్రామ పరిధిలో సుమారు 26 గ్రామ పంచాయతీలు, (సుమారు 20 తాండాలు) ఉన్నాయి. ఈ గ్రామాల వారికి ఎస్బీఐ బ్యాంకు కేటాయించారు. దీని పై 10,000 వేల పైగా మంది ఖాతాదారులు ( Clients ) ఆధారపడి ఉన్నారు. రుణాలకు సంబంధించి 5,822 ఖాతాదారులు ఉన్నారు. ఉద్యోగస్తుల ఖాతాలు, సేవింగ్ ఖాతాలు ఉన్నాయి. ఇంకా స్వయం సహాయక సంఘాల ఖాతాలు, ఇతర కరెంట్ ఖాతాలు, క్రెడిట్ కార్డు ఖాతాలు ఉన్నాయి.
డబ్బు (నగదు) కోసం తప్పని తిప్పలు..
రైతుబంధు, రైతు రుణమాఫీ, పంట రుణాలు, మహిళ సంఘాల రుణాలతో పాటు, రోజువారీ సాధారణ లావాదేవీలు జరుగుతాయి. అయితే పంట పెట్టుబడులతో పాటు, ఆర్థిక అవసరాల కోసం నగదు అవసరమైన ఖాతాదారులకు, బ్యాంకు ఎదుట పడికాపులు పడుతున్నారు. రుణాల కోసం రైతులు, మహిళా సంఘాలు, వ్యాపారస్తులకు సకాలంలో నగదు దొరకగా, ఇబ్బందులు పడుతున్నారు. లైన్ లో నిలబడలేక, కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుబంధు సమయంలో ఖాతాదారులు ఉదయం 7 గంటలకే బ్యాంకు ముందు లైన్ లో నిలబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లైన్ లో నిలబడలేక, సహనం కోల్పోయి, ఒకసారి తోపులాట, తిట్టుకుంటారు. రుణమాఫీ, రైతుబంధు సమయంలో బ్యాంకు కిటకిటలాడుతుంది. ఇక్కడ ఇబ్బంది కలిగించే విషయమేమిటంటే, రైతులు, రుణాల కోసం 2-3 నెలలుగా బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
సిబ్బంది కొరత...
ఖాతాదారులకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో, ఖాతాదారులకు సరియైన న్యాయం చేయలేకపోతున్నారు.ఇప్పటికే బ్యాంక్ మేనేజర్ కు, వికారాబాద్ రీజినల్ మేనేజర్ ను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్యాంకులో సిబ్బందిని పెంచాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ఖాతాదారులకు అనుగుణంగా, సిబ్బందిని పెంచినట్లయితే ఇబ్బందులు తగ్గుతాయని ప్రజలు కోరుతున్నారు.
నూతన దుద్యాల మండలంలో బ్యాంకు ఏర్పాటు చేయాలి.. హన్మంతు, దుద్యాల
బొంరాస్ పేట్ మండలం నుండి వేరుపడి, దుద్యాల మండలం ఏర్పాటయింది. ఈ మండలంలో 6 గ్రామాలకు హకీంపేట ఏపీజీవీబీ బ్యాంకు అందుబాటులో ఉంది. 12 గ్రామపంచాయతీ వారు కొడంగల్ లో ఉన్న బ్యాంకులకు వెళ్తున్నారు. ఏవైనా లావాదేవీల కోసం కొడంగల్ కు వెళ్లాలి. దీంతో సమయంతో పాటు, డబ్బులు వృధా అవుతున్నాయని వాపోపుతున్నారు. అందుకే దుద్యాల మండలం కేంద్రంలో బ్యాంకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం.. బి.మహిపాల్, మాజీ సర్పంచ్ మహంతీపూర్..
ఓకే బ్యాంకు ఉండడంతో, తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్తే, గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతు రుణమాఫీ, రైతుబంధు సమాచారం కోసం రెండు, మూడు రోజులు బ్యాంకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో బ్యాంక్ ఏర్పాటు చేస్తే, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
సమయం వృధా అవుతుంది.. రతన్ నాయక్, డైరెక్టర్, బాపల్లి తండా..
ఎస్బీఐ బ్యాంకు లో ఖాతా ఉండటంతో, ఏదైనా లావాదేవీల గురించి వెళ్లాలంటే, అన్ని పనులు వదులుకొని, వెళ్లాల్సి వస్తుంది. దీంతో సమయం వృధాతో పాటు, అధిక ఖర్చులు అవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి మరో బ్యాంకు ఏర్పాటు చేయాలి.