temple : ప్రభుత్వ వైఫల్యం వల్లే హిందూ దేవాలయాల పై దాడులు.. హిందూ సంఘాలు
ప్రభుత్వ వైఫల్యం వల్లే హిందూ దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయని హిందూ సంఘాలు పేర్కొన్నాయి.
దిశ, శంషాబాద్ : ప్రభుత్వ వైఫల్యం వల్లే హిందూ దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయని హిందూ సంఘాలు పేర్కొన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ ఎయిర్పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయం ముందు ఉన్న నవగ్రహ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బుధవారం శంషాబాద్ బస్టాండ్ నుండి డీసీపీ ఆఫీస్ వరకు హిందూ సంఘాలు, అఖిలపక్ష నాయకులు అందరూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహిస్తూ దుకాణ సముదాయాలను మూసి వేయించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులకు నాయకులకు వాగ్వివాదం చోటుచేసుకుని కాసేపు ఉధృత పరిస్థితి నెలకొంది. అనంతరం ర్యాలీ సాఫీగా కొనసాగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే హిందూ దేవాలయాల పై దాడులు విపరీతంగా పెరిగాయని, ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ ఏ చర్య తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దాడులు పెరిగిపోయాయి అన్నారు. హిందూ దేవాలయాల పై దాడి చేసిన వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ దాడుల పై ప్రభుత్వం స్పందించకుంటే హిందువులమంతా ఏకమై హిందూ దేవాలయాలను కాపాడుకుంటామన్నారు. హిందూ దేవాలయాలను కాపాడాలని ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు మాత్రం మమ్మల్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. దేవాలయాల పై దాడి చేసిన వారిని గుర్తించకుండా హిందువుల పైనే ఆంక్షలు పెట్టడం ఏమిటి అన్నారు. ప్రభుత్వం కేవలం పోలీసులను వారి సభలకు, వారి బందోబస్తులకే వాడుకుంటుంది కానీ ప్రజల సంక్షేమం, ప్రజల రక్షణ, దేవాలయాల పరిరక్షణను గాలికి వదిలేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ తోపాటు పార్టీలకతీతంగా పెద్ద సంఖ్యలో యువకులు ర్యాలీలో పాల్గొన్నారు.