పేరు హౌసింగ్ బోర్డుది.. ఆదాయం జీహెచ్‌ఎంసీది.. ఆ గ్రౌండ్ ఎవరిది?
కేపీహెచ్‌బీ కాలనీ ఏర్పడిన నాటి నుంచి లేఔట్ ప్రకారం 2.5ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రమ్య గ్రౌండ్‌ను ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయించారు. కాగా 2001 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రమ్య గ్రౌండ్స్ జీహెచ్‌ఎంసీ ఆధీనంలోనే ఉంది. కాగా ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ రమ్య గ్రౌండ్ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోపోగా గ్రౌండ్స్‌లో సభలు, సమావేశాలు, దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపులు, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసుకుంటే రోజుకు 7 నుంచి 10 వేల వరకు జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో డబ్బులు వసూలు చేస్తోంది.
దిశ, కూకట్‌పల్లి: ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా పేరుగాంచిన కేపీహెచ్‌బీ కాలనీలో ఖాళీ మైదానాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. హౌసింగ్ బోర్డు, జీహెచ్‌ఎంసీ శాఖల మధ్య సమన్వయ లోపంతో కాలనీ మూడో ఫేజ్‌లోని 2.5 ఎకరాల్లో గల రమ్య గ్రౌండ్స్ అధ్వాన్నంగా మారింది. గ్రౌండ్‌లో సమావేశాలు, స్టాల్స్, బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేస్తే వారి నుంచి డబ్బులు దండుకుంటున్న జీహెచ్‌ఎంసీ మాత్రం నిర్వహణ బాధ్యతలను విస్మరిస్తుంది. రమ్య గ్రౌండ్స్ తమ ఆధీనంలో ఉందని హౌసింగ్ బోర్డు అధికారులు బోర్డును ఏర్పాటు చేసి వదిలేశారు. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం, పర్యవేక్షణ లేక గ్రౌండ్ పూర్తిగా అధ్వాన్నంగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కొందరు గ్రౌండ్ లో బహిరంగ మూత్ర విసర్జన చేస్తుండడంతో వాకింగ్ కు వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలకు కేటాయింపు
కేపీహెచ్‌బీ కాలనీ ఏర్పడిన నాటి నుంచి లేఔట్ ప్రకారం 2.5ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రమ్య గ్రౌండ్‌ను ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయించారు. కాగా 2001 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రమ్య గ్రౌండ్స్ జీహెచ్‌ఎంసీ ఆధీనంలోనే ఉంది. కాగా ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ రమ్య గ్రౌండ్ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోపోగా గ్రౌండ్స్‌లో సభలు, సమావేశాలు, దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపులు, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసుకుంటే రోజుకు 7 నుంచి 10 వేల వరకు జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో డబ్బులు వసూలు చేస్తోంది. వసూలు చేసిన ఏ ఒక్క రూపాయి రమ్య గ్రౌండ్స్ నిర్వహణకు వినియోగించకుండా, గ్రౌండ్ హౌసింగ్ బోర్డు శాఖ ఆధీనంలో ఉందంటూ దాటవేస్తోంది. అదేవిధంగా 9వ ఫేజ్‌లోని రెండెకరాల ఖాళీ మైదానంలో సైతం జీహెచ్‌ఎంసీ స్పోర్ట్ విభాగం ఆధ్వర్యంలో డబ్బులు వసూలు చేస్తోంది.
స్కూల్ నిర్మాణానికి పోరాడిన కోప్ సంస్థ
కేపీహెచ్‌బీకాలనీ మూడో ఫేజ్‌లో స్కూల్ నిర్మాణానికి హౌసింగ్ బోర్డు శాఖ లేఔట్లో 2.5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కాగా ఆ స్థలాన్ని జీహెచ్‌ఎంసీ వినియోగించుకుని యోగా సెంటర్, బాల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్‌ను ఏర్పాటు చేస్తుంటే కోప్ స్వచ్ఛంద సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అధికారులు యోగా కేంద్రం నిర్మాణ పనులను మానుకున్నారు. కాగా అందులో నుంచి సుమారు 2 వేల గజాల స్థలంలో సీఎస్ఆర్ కింద ప్రైవేటు వ్యక్తులతో ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అధ్వానంగా రమ్య గ్రౌండ్
రమ్య గ్రౌండ్‌లో స్థానిక యువత, క్రీడాకారులు షటిల్, వాలిబాల్ ఆడుకునేందుకు వస్తుంటారు. గ్రౌండ్‌లో విద్యుత్ దీపాలు సరిగా లేక, మైదానమంతా గుంతల మయమై, చెత్తాచెదారం నిండి క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రమైతే మైదానంలో మందుబాబుల హల్ చల్ ఎక్కువగా ఉంటుందని స్థానికులు ఆవేన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రమ్య గ్రౌండ్ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్న యువకులను పోలీసులు అదుపులో తీసుకున్నారంటే ఇక్కడి పరిస్థతి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది.
విద్యా శాఖకు అప్పగిస్తున్నాం
కిరణ్ బాబు, ఈఈ, హౌసింగ్ బోర్డు శాఖ.
కేపీహెచ్‌బీకాలనీ లేఔట్ ప్రకారం రమ్య గ్రౌండ్ 2.5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయించారు. జిల్లా విద్యాశాఖ అధికారికి ఇప్పటికే ప్రపోజల్పంపాం. వారి నుంచి రిప్లే ఇచ్చిన వెంటనే అప్పగించేందుకు తీసుకోవాల్సిన చర్యలను పూర్తి చేస్తాం. రమ్య గ్రౌండ్ స్థలం పూర్తిగా ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి కేటాయించాం.
అధికారుల అలసత్వంతోనే సమస్య
యూ. శివప్రసాద్, కోప్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి.
రమ్య గ్రౌండ్‌కు చెందిన 2.5ఎకరాల స్థలం కాలనీ లేఔట్ ప్రకారం ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ఆ స్థలాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు యోగా కేంద్రానికి, బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి కేటాయిస్తుంటే కోప్ సంస్థ తరపున న్యాయస్థానాన్ని ఆశ్రయించి జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలను అడ్డుకున్నాం. 2.5ఎకరాల్లో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం జరగాల్సిందే.