బెదిరింపు కాల్స్ ఎఫెక్ట్.. అమిత్ షాకు రాజాసింగ్ ఫిర్యాదు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ రవిగుప్తాకు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. బుధవారం బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ఆయన ఫిర్యాదు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ రవిగుప్తాకు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. బుధవారం బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ఆయన ఫిర్యాదు చేశారు. పదే పదే తనకు వస్తోన్న బెదిరింపు కాల్స్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఉదయం రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా రాజాసింగే సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. పలు అంతర్జాతీయ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
బెదిరింపు కాల్స్ తనకు కొత్త కాదని.. గతంలో ఎన్నో ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఒక బాధ్యతగల పౌరుడిగా తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. తాజాగా ఏయే నెంబర్ల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయనే విషయాన్ని రాజాసింగ్ తెలిపారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెంబర్‌ను బెదరింపులకు పాల్పడుతున్న వారికి ఇచ్చినట్లు వెల్లడించారు.