Raghunandan Rao: రాహుల్ గాంధీ పెళ్లి కథనాలపై సోనియా నివాసానికి బీజేపీ ఎంపీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లిపై బ్లిడ్జ్ పత్రికలో వచ్చిన కథనాలపై ఆయన స్పందించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు.

Update: 2024-08-23 10:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లిపై బ్లిడ్జ్ పత్రికలో వచ్చిన కథనాలపై ఆయన స్పందించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని కలిసేందుకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ తో కలిసి ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి ఆయన వెళ్లారు. సోనియా గాంధీ నివాసంలోకి వెళ్లిన ఆయన రాహుల్ గాంధీ మీటింగ్ లో ఉన్నారని తెలుసుకొని.. ఆయన స్టాఫ్ కు ఈ పత్రాలు అందజేసి వెనుదిరిగారు. బయటకి వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో మీడియా మిత్రులకు చెప్పినట్లు బ్లిట్జ్ దినపత్రికలో వచ్చిన కథనాలకు సంబందించిన పత్రాలను రాహుల్ గాంధీకి ఇవ్వడానికి రావడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ మీటింగ్ లో ఉన్నారని చెప్పి వారి స్టాఫ్ ఈ పత్రాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఆయన పెళ్లిపై వచ్చిన ఈ కథనాలపై రాహుల్ గాంధీ ఏం చర్య తీసుకుంటారో ఎదురు చూస్తున్నానని రఘునందన్ రావు అన్నారు. కాగా గురువారం హైదరాబాద్ లో ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీకి పెళ్లై పిల్లలు ఉన్నట్లు బంగ్లాదేశ్ కు చెందిన బ్లిట్జ్ పత్రిక కథనాలు ప్రచురించిందని, ఆ పత్రికకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆ పత్రికలోని మహిళ రాహుల్ సతీమణా..? రాహుల్ పెళ్లి చేసుకున్నారా.. లేక లివింగ్ టుగెదర్ లో ఉన్నారా చెప్పాలని నిలదీశారు. రాహుల్ గాంధీ తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని, ఢిల్లీకి వెళ్లి స్వయంగా ఆయనకు బ్లిట్జ్ పేపర్ చూపిస్తానని చెప్పారు.

Tags:    

Similar News