పీవీ, KCR మెజార్టీ రికార్డులు బద్దలు.. చరిత్ర సృష్టించిన రఘువీర్ రెడ్డి
నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో గతంలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ఫలితాలు వెలువడ్డాయి.
దిశ, తెలంగాణ బ్యూరో / నల్లగొండ బ్యూరో : నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో గతంలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ఫలితాలు వెలువడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు లక్షల పై చిలుకు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి విజయం సాధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి పార్లమెంటు రికార్డులన్నింటినీ బ్రేక్ చేశారు. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎంపీ ఎన్నికలు జరిగితే హయ్యెస్ట్ రికార్డు కావడం గమనార్హం.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో నల్లగొండ నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి బరిలోకి దిగారు. బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేశారు. అయితే మొదటి నుంచి నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే కుందూరు రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీ సాధించారు.
దరిదాపుల్లో లేని బీజేపీ, బీఆర్ఎస్
నల్లగొండ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు దరిదాపుల్లో లేకుండా పోయాయి. కాంగ్రెస్ పార్టీ జోరుకు బీజేపీ, బీఆర్ఎస్ కొట్టుకుపోయాయి. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి 7,84,337 ఓట్లు, బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 2,24,431 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల క్రిష్ణా రెడ్డికి 2,18,417 ఓట్ల వచ్చాయి. రఘువీర్ రెడ్డి 5,59, 906 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే నల్లగొండలో బీఆర్ఎస్ ఏకంగా మూడో స్థానానికి పరిమితం అయ్యింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 5,26,028 ఓట్లు సాధించగా, టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి 5,00,346 ఓట్లు సాధించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం 25,682 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజార్టీ ఇదే
దేశ వ్యాప్తంగా అతి ఎక్కువ మెజార్టీ పొందిన నేతల్లో నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి మూడో స్థానంలో నిలిచారు. ఫస్ట్ ప్లేస్‌లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని 11 లక్షల 75 వేలు మెజారిటీతో శంకర్ లల్వాని నిలవగా, రెండో స్థానంలో గాంధీ నగర్‌లో అమిత్ షా 7 లక్షల 25 వేలు రికార్డు సాధించారు. థర్డ్ ప్లేస్‌లో కందూరు రఘువీర్ రెడ్డి 5 లక్షల 5 వేలు మెజార్టీ సాధించారు. రాష్ట్రంలో ఇదే హయ్యేస్ట్ మెజార్టీ కావడం గమనార్హం. ఇక ఆ తర్వాతి స్థానంలో ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ రామసహాయం రాఘురాం రెడ్డి 4,67,847 ఓట్ల మెజార్టీ సాధించారు. వరంగల్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కడియం కావ్య 2,20,339, భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2,22,170, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ 1,31,364, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్ 4,61,74, నాగర్‌కర్నూల్ నుంచి డాక్టర్ మల్లు రవి 94,414, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ 3,49,028 మెజార్టీ సాధించారు.
తొలి ఎన్నికల్లో రావి రికార్డు
నల్లగొండ పార్లమెంటు స్థానం ఏర్పడిన నాటి నుంచి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. చారిత్రక ప్రాధాన్యం కలిగిన నల్లగొండ లోక్‌సభ స్థానంలో 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి పీడీఎఫ్ అభ్యర్థి, కమ్యూనిస్టునేత రావి నారాయణరెడ్డి దేశవ్యాప్తంగా అత్యధిక మెజార్టీ సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 3,09,162 ఓట్లు రాగా, 2,22,280 ఓట్ల మెజార్టీ వచ్చింది. అప్పట్లో ఇది దేశవ్యాప్త రికార్డు మెజార్టీ. ఆ గౌరవంతోనే ఆయనతో నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పార్లమెంటు భవనాన్ని ప్రారంభం చేయించారు. ఆ ఎన్నికల్లో నెహ్రూ కంటే అధిక ఓట్లు సాధించిన ఘనత రావి నారాయణరెడ్డిదే. అంతటి ప్రాధాన్యం కలిగిన లోక్‌సభ నియోజకవర్గ స్థానంలో మళ్లీ 72 ఏళ్ల తర్వాత ఆ స్థాయి రికార్డు మెజార్టీని కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి సాధించారు. 1994 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంటు నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి 1,93,156 ఓట్ల మెజార్టీ సాధించారు.
దేశంలోనే రెండో భారీ మెజార్టీ
2014లో మహారాష్ట్రలోని వీడు లోక్‌సభ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో 6,96,321 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీలను పరిశీలిస్తే 1991 లోక్‌సభ ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు 5,80,297 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటిసారి తెలుగుబిడ్డ ప్రధానమంత్రి పదవిని అధిరోహించిన నేపథ్యంలో ఆయన గౌరవార్థం అప్పటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అభ్యర్థిని పోటీలో నిలపలేదు. అయితే బీజేపీ నుంచి బంగారు లక్ష్మణ్ పోటీచేయగా, ఆయనకు కేవలం 45,944 ఓట్లు మాత్రమే వచ్చాయి.
జిల్లాకు చెందిన మోత్కుపల్లి నరసింహులు స్వతంత్ర అభ్యర్థిగా ఆ ఎన్నికల్లో పోటీచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 ఎన్నికల్లో మెదక్ నుంచి గెలుపొందిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుదే ఆల్‌టైమ్ రికార్డు. ఆయనకు ఆ ఎన్నికలో 3,97,029 ఓట్ల భారీ మెజార్టీ దక్కింది. స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ నుంచి ఆల్‌టైమ్ రికార్డు మెజార్టీ కూడా అదే. అదే ఎన్నికల్లో వరంగల్ నుంచి గెలుపొందిన కడియం శ్రీహరి (బీఆర్‌ఎస్) 3,92,574 ఓట్ల మెజార్టీతో రెండో స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో వరంగల్ నుంచి గెలుపొందిన పసునూరి దయాకర్ 3,50,298 ఓట్ల మెజార్టీ దక్కింది. అయితే ప్రస్తుతం నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 5,59,906 ఓట్ల మెజార్టీ సాధించారు.
ఈ మెజార్టీతో తెలంగాణలో ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డుగా ఉన్న కేసీఆర్ ( 3,97,029), కడియం శ్రీహరి (బీఆర్‌ఎస్) 3,92,574 ఓట్లు, 2019 ఎన్నికల్లో వరంగల్ నుంచి గెలుపొందిన పసునూరి దయాకర్ 3,50,298 ఓట్ల మెజార్టీని బ్రేక్ చేసేశారు. అయితే దేశవ్యాప్తంగా ఆల్‌టైమ్ రికార్డు 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన డాక్టర్ ప్రీతమ్ గోపీనాథ్ ముండేకు అత్యధికంగా 6,96,321 ఓట్ల మెజార్టీతో ఉంది. ప్రీతం ముండే తర్వాత దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన పార్లమెంటు సభ్యుడిగా కుందూరు రఘువీర్ రెడ్డి పార్లమెంటు చరిత్రలో రికార్డు కెక్కారు. ఎన్నికల్లో క్రియాశీలకంగా ప్రవేశించిన మొదటి ఎన్నికల్లోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే స్థాయిలో మెజార్టీ ఓట్లను సాధించడం ఆయన రాజకీయ ఎదుగుదలకు శుభ సూచకంగా పరిగణించవచ్చు.