సైకో ప్రేమ.. బంధాలను నిలుపుకోలేక శరీరాన్ని ముక్కలు చేస్తూ హత్యలు

స్వచ్ఛమైన యువ హృదయాలు కల్మశమవుతున్నాయి. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి.

Update: 2023-02-28 09:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్వచ్ఛమైన యువ హృదయాలు కల్మశమవుతున్నాయి. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. విచక్షణ కోల్పోతున్న చాలా మంది నేరస్తులుగా మిగులుతున్నారు. ప్రేమ, సహజీవనం, వివాహేతర సంబంధాలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. వీటి కారణంగా జరుగుతున్న హత్యలు కలవరపెడుతున్నాయి. అనేక హత్యల్లో వెలుగు చూస్తున్న నిజాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. వీటి కారణంగా తరచూ జరుగుతున్న హత్యలు వార్తల్లో తరచూ దర్శనమిస్తున్నాయి. నేర ప్రవృత్తి లేని వారు సైతం క్షణికావేశంలో హంతకులుగా మారి తమ బతుకులను ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారు.

సహజీవనానికి ఓకే.. పెళ్లికి నో

ఢిల్లీలో శ్రద్ధా వాకర్, నిక్కీ యాదవ్ హత్యలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ రెండు ఘటనల్లో అమ్మాయిలనే చంపగా ఇద్దరు ఢిల్లీకే చెందినవారే కావడం గమనార్హం. పాశ్చాత్య సంస్కృతి మాదిరిగా సహజీవనం చేస్తున్న యువత పెళ్లి విషయానికొచ్చే సరికి మాత్రం సుముఖత చూపడం లేదు. వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని అఫ్తాబ్, పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో సాహిల్ గెహ్లోట్ శ్రద్ధా, నిక్కీని అత్యంత దారుణంగా చంపిన ఉదంతం తెలిసిందే.

శరీర భాగాలను ముక్కలుగా నరకడం, ఆయా భాగాలను వేర్వేరు చోట్ల విసిరేయడం, ఇంట్లోనే శరీర భాగాలు ఫ్రిడ్జ్‌లో దాయడం వంటి దారుణ విషయాలు శ్రద్ధా హత్య కేసు విచారణలో వెలుగు చూశాయి. ఇంత జరిగినా నిందితుడు అఫ్తాబ్‌లో పశ్చత్తాపం కనిపించకపోగా ఉరి వేస్తే వేయండని తాను స్వర్గానికే వెళ్తాను అనడం లాంటివి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. యువతకు డ్రగ్స్ అలవాటు కావడం కూడా నేరాలకు పాల్పడేలా దారి తీస్తోందని నిపుణులు అంటున్నారు. డ్రగ్స్ వాడకం ద్వారా వీపరీతమైన కోపం, చిరాకు కారణంగా నేరాలు పెరుగుతున్నాయి.

వాటి ప్రభావం కారణంగా..

ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఘటనలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. తాను ప్రేమించిన అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడనే కారణంగా నవీన్ అనే యువకుడిని హరిహర కృష్ణ అత్యంత పాశవికంగా హత్య చేసి గుండెను వేరు చేసి ఫోటో తీయడం, మర్మాంగాలు కోయడం, చేతి వేలును కట్ చేయడం విస్మయానికి గురి చేసింది. చిన్న నాటి స్నేహితుడైన నవీన్‌ను హత్య చేసిన హరిహర కృష్ణ విచారణలో వెలుగు చూసిన అంశాలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. కాగా నిందితుడిపై సీరియల్ కిల్లర్, వెబ్ సిరీస్‌‌ల ప్రభావం ఉన్నట్లు విచారణలో తేలింది.

శ్రద్ధా వాకర్ హత్య సందర్భంగా కూడా నిందితుడు అఫ్తాబ్ అమెరికన్ వెబ్ సిరీస్ డెక్స్‌టర్ చూసేవాడని విచారణలో తేలింది. వీటితో పాటు సినిమాల్లో సైతం కొత్త కొత్త పద్ధతుల్లో చంపడం.. తప్పించుకోవడం ఎలా అనే కాన్సెప్ట్‌లను తరచూ చూయిస్తున్నారు. వీపరితమైన హింసను చూయిస్తూనే.. చంపాడాన్ని హీరోయిజం అన్న చందంగా ప్రొజెక్ట్ చేయడం కూడా నిందితులపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కొంత మంది యువకులు తమను ప్రేమించడం లేదని అమ్మాయిలపై దాడులకు దిగడం, చంపడం తరచూ చూస్తునే ఉన్నాం. ఇటీవల కూకట్ పల్లిలో పెళ్లికి నిరాకరించిన ఓ యువకుడిపై యువతి బ్లేడ్ తో దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది.

వివాహేతర సంబంధాలు.. తరచూ హత్యలు

ఆనందంగా సాగుతున్న చాలా మంది వైవాహిక జీవితాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ఈ మధ్య వివాహేతర సంబంధాల కారణంగా తరచూ హత్యలు జరుగుతున్నాయి. ఇవి కలకలం సృష్టిస్తున్నాయి. ప్రియుడి మోజులో పడి భర్తలను భార్యలు చంపుతుంటే.. ఈ దారుణాలను తట్టుకోలేక కొంత మంది భర్తలు తమ భార్యలు, వారి ప్రియుళ్లను హతమారుస్తున్నారు. మరికొన్ని ఘటనల్లో వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారని కన్న బిడ్డలను, అత్త, మామలను చంపుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో గతేడాది జరిగిన జంట హత్యలు కలకలం సృష్టించగా వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య జ్యోతితో పాటు ఆమె ప్రియుడు యశ్వంత్‌ను భర్త బండరాయితో మోది స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపడం సంచలనంగా మారింది. నగరంలోని శివారు ప్రాంతాల్లో తరచూ ఈ హత్యలు జరుగుతున్నాయి. బంధాలను నిలుపుకుంటామని చేసిన బాసలను మరిచి చాలామంది వింత పోకడలకు అలవాటు పడి చివరికి తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ ఘటనలు అనేక కుటుంబాల్లో విషాదాలు నింపుతుండగా సమాజాన్ని కలవర పెడుతున్నాయి. 

Tags:    

Similar News