గౌడ్‌లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.. వృత్తిదారుల పై కక్ష సాధింపు చర్యలోద్దు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గౌడ్ లకు ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

Update: 2024-07-15 16:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గౌడ్ లకు ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. త్వరలోనే అన్ని సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ చేపడ్తామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో సోమవారం మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్, ఇస్లావత్ రామచంద్రునాయక్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. గౌడ్‌లకు వైన్స్ లలో 15 నుంచి 25 శాతం పెంచుతామని, జనగాం జిల్లాకు పాపన్నగౌడ్ పేరు పెడతామని, ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహం ప్రతిష్టిస్తామని, మోపెడ్ ఇస్తామని, ప్రస్తుతం 5లక్షల ఎక్స్ గ్రేషియాను 10 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ఎప్పటిలోగా అమలులో చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల పాపన్న జయంతి ఉందని ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

పాపన్న గుట్టను పర్యవేక్షించాలని 4 వేల ఎకరాలను కేటాయించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రైవేటుకు అప్పగించాలనే ప్రయత్నం మానుకోవాలని కోరారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 4 వేల పెన్షన్, హైబ్రిడ్ తాటి మొక్కలు నాటాలని, గిరక చెట్లు సైతం పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలను ఎంచుకొని నాటించాలన్నారు. ఆత్మగౌరవ భవనాల పనులు పూర్తికి చొరవ తీసుకోవాలని, వాటిని అధ్యయన కేంద్రాలు తీర్చిదిద్దాలని కోరారు. వృత్తిదారుల పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దని సూచించారు. అన్ని కులవృత్తులకు ఇచ్చిన హామీలపై కమిటీ వేసుకొని సమస్యలను పరిష్కరించాలన్నారు. గత ప్రభుత్వం ఏమీ చేయలేదన్నట్లుగా మాట్లాడటం దారుణమన్నారు. కాటమయ్య రక్షణ కవచం కింద మోకుల పంపిణీ కార్యక్రమంలో గీతకార్మికుల సమస్యలపై సీఎంగా`నీ, మంత్రులు గానీ, గీత కార్మిక సంఘాలు కానీ మాట్లాడక పోవడం దురదృష్టకరం అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఒత్తిడి చేస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News