ఆ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్సు పెట్టండి.. డిప్యూటీ సీఎంను కోరిన నిర్మాతలు

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Update: 2024-10-14 14:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెలలోనే అభ్యర్థులకు ఉపాధిని కల్పించే నాలుగు కోర్సులను ప్రారంభించనుంది. అయితే స్కిల్ యూనివర్సిటీలో ఇంకో కోర్సును కూడా పెట్టాలని తెరపైకి వచ్చింది. స్కిల్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్సు పెట్టాలని తెలుగు సినీ నిర్మాతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశం నిర్వహించడం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అద్భుతమైనదని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ డిప్యూటీ సీఎంకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి తో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమిటీ సభ్యులు నర్సింగరావు, తనికెళ్ల భరణి, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరీశ్ శంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాని శ్రీధర్, గుమ్మడి విమల సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంపై భట్టి ఎక్స్ వేదికగా పలు విషయాలను పంచుకున్నారు. తెలంగాణ అంటేనే ఆట, పాట ఈ తెలంగాణ ఆట, పాటను ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని పేర్కొన్నారు. తెలంగాణ సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గౌరవిస్తుంది, ఈ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలని కోరారు.


Similar News