T - Congress సంక్షోభంపై హైకమాండ్ ఫోకస్.. రంగంలోకి ప్రియాంక గాంధీ!

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీలు అగ్గి రాజేశాయి. కమిటీల్లో కొందరి తీవ్రంగా అన్యాయం జరిగిందని.. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి వలస వచ్చిన వారికే కమిటీల్లో ఎక్కువ పదవులు కట్టబెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై హస్తం పార్టీ సీనియర్ నేతలు తిరుగుబాటు చేశారు.

Update: 2022-12-19 10:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీలు అగ్గి రాజేశాయి. కమిటీల్లో కొందరికి తీవ్రంగా అన్యాయం జరిగిందని.. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి వలస వచ్చిన వారికే కమిటీల్లో ఎక్కువ పదవులు కట్టబెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై హస్తం పార్టీ సీనియర్ నేతలు తిరుగుబాటు చేశారు. సీనియర్లంతా ఏకమై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశమై.. సేవ్ కాంగ్రెస్ పేరుతో కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్ వలసదారుల పాలనలో ఉందని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటూ సీనియర్లంతా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యి నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుండి వచ్చిన వారికి పీసీసీ కమిటీల్లో ఎక్కువ పదవులు ఇచ్చారని సీనియర్ నేతలు ఆరోపణలు చేశారు. సీనియర్ల ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన 12 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు.

దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. సీనియర్లంతా ఒక వర్గం కాగా.. రేవంత్ రెడ్డిది మరో వర్గంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల వ్యుహాలతో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పటిలాగే కీలక సమయంలో వర్గ విభేదాలు, అధిపత్య పోరుతో బిజీగా ఉంది. టీ కాంగ్రెస్‌లో సంక్షోభం తారాస్థాయికి చేరుకోవడంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై అధిష్టానం ఆరా తీసింది.

కాంగ్రెస్‌లో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగారు. ఏఐసీసీ సెక్రటరీ నదీంకు ఫోన్ చేసిన ప్రియాంకా గాంధీ.. తాజా పరిణామాలపై ఆరా తీశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై సీనియర్ల తిరుగుబాటు, పీసీసీ కమిటీలకు 12 మంది రాజీనామా వంటి విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.  అసమ్మతి నేతలను పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీకి రావాలని సూచించారు. దీంతో సీనియర్ నేతలు ఈ నెల 23వ తేదీ తర్వాత హస్తిన బాట పట్టునున్నట్లు తెలుస్తోంది. స్వయంగా ప్రియాంకా గాంధీ రంగంలోకి  దిగడంతో త్వరలోనే టీ కాంగ్రెస్ వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 

Also Read:  T- కాంగ్రెస్ వివాదం.. ఆ సీనియర్ నేతకు ప్రియాంక గాంధీ ఫోన్ కాల్..?

                     కాంగ్రెస్ అసంతృప్తి నేతలతో బండి సంజయ్ రహస్య భేటీ! 

Tags:    

Similar News