తెలుగు రాష్ట్రాలకు ప్రియారిటీ.. AP, తెలంగాణకు ఎన్ని కేంద్ర మంత్రి పదవులంటే..?

కేంద్ర మంత్రివర్గంలో ఈసారి 2 తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత లభించనున్నది.బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో టీడీపీ సహకారం అనివార్యమైంది.

Update: 2024-06-06 01:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రివర్గంలో ఈసారి 2 తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత లభించనున్నది.బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో టీడీపీ సహకారం అనివార్యమైంది. దీంతో ఆ రాష్ట్రానికి ఒక కేబినెట్ పోస్టుతో పాటు 2 సహాయ (ఎంఓఎస్) మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ సిద్ధమవుతున్నది. తెలంగాణలో గతంలో కంటే డబుల్ స్థానాలను చేజిక్కించుకోవడంతో ఒక కేబినెట్, మరో ఎంఓఎస్ ఇచ్చేలా చర్చలు ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నాయి. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలనేదానిపై బీజేపీ నాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నది.ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం కొలువుదీరాక మంత్రివర్గ విస్తరణపై స్పష్టత రానున్నది.రాష్ట్రపతి భవన్ వేదికగా ఎంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనేది శుక్రవారం జరిగే ఎన్డీఏ సమావేశంలో ఖరారు కానున్నది.

ఇద్దరికి మంత్రి పదవులు.. ఒకరికి పార్టీ స్టేట్ చీఫ్

గత ఎన్నికల్లో రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు గెలిచినా కేంద్ర మంత్రివర్గంలో కిషన్‌రెడ్డికి మాత్రమే అవకాశం లభించింది. అంతకు ముందు దత్తాత్రేయ ఎంపీగా ఉన్నప్పుడూ ఆయనకొక్కరికే చోటు దక్కింది.కానీ, ఈసారి ఒక కేబినెట్‌తో పాటు మరో ఎంఓఎస్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.ఈ రెండు పోస్టులతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా ఎవరో ఒకరికి అప్పజెప్పాల్సి ఉన్నందున ప్రస్తుతం గెలిచిన 8 మందిలోనే ఒకరికి ఇవ్వాలన్నది కేంద్ర పార్టీ ఆలోచన. ఇద్దరు కేబినెట్‌లోకి వెళితే మిగిలిన ఆరుగురిలో సీనియర్‌కు స్టేట్ చీఫ్ పోస్టు దక్కే అవకాశమున్నది. కేంద్ర మంత్రి అవకాశంపై ఇప్పటికే మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.లాబీయింగ్ చేయనని, కేంద్రం ఏ బాధ్యత అప్పగించినా సిద్ధమేనన్నారు.

9 తర్వాతే క్లారిటీ..

ఈనెల 9న కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రివర్గ విస్తరణకు మరింత టైం పడే చాన్స్ ఉంది. అయితే, సీనియారిటీ,సామాజిక సమీకరణాలు, జిల్లాలకు ప్రాధాన్యత తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఇద్దరు వ్యక్తులపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది. అదే టైంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే వ్యక్తికి సంస్థాగతమైన బాధ్యతలను అందించనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీసీ నేత సీఎం అవుతారంటూ ప్రధాని మోడీ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా, అందుకు అనుగుణంగా ఎంపిక జరగనుంది.

ఏపీకి ఒక కేబినెట్,రెండు ఎంఓఎస్!

కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ పార్టీ మద్దతు అనివార్యమైంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నందున ఒక కేబినెట్ పదవితో పాటు మరో రెండు ఎంఓఎస్‌లను ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది. ఏ రాష్ట్రానికి ఎన్ని పదవులు ఇవ్వాలనే దానిపై పార్టీ నాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోయినా ప్రధాని నివాసంలో బుధవారం జరిగిన ఎన్డీయే కూటమి మీటింగ్ అనంతరం లీకుల రూపంలో,సంకేతాలిచ్చే తీరులో కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. టీడీపీ నుంచి స్పీకర్ పోస్టు, ఎన్డీయే కన్వీనర్ బాధ్యతలు,కేంద్ర మంత్రివర్గంలో చోటు, స్పెషల్ స్టేటస్, కేంద్రం నుంచి ఆర్థిక సాయం ఇలాంటి పలు డిమాండ్లు రావొచ్చని బీజేపీ అగ్ర నాయకత్వం ముందుగానే ఒక అంచనాకు వచ్చింది. దీంతో బీజేపీ స్వచ్ఛందంగా ఒక కేబినెట్, రెండు ఎంఓఎస్ పోస్టులను ఆఫర్ చేసే అవకాశమున్నది.

కేంద్రానికి టీడీపీ మద్దతు ఎంత అవసరమో.. కేంద్రం నుంచి తమకు అలాంటి సహకారమే కావాలని చంద్రబాబు కూడా కోరుకుంటున్నారు. దీంతో రెండు పార్టీలు పరస్పర సహకారంతో, సమన్వయంతో వెళ్లడం అవసరమన్న భావనతో టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు రాష్ట్ర అవసరాలను తీర్చడానికి కూడా బీజేపీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని కేంద్ర వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. కాగా, రాష్ట్రపతి భవన్‌లో ఈనెల 9న మోడీ దేశ ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయన్నారు.

Tags:    

Similar News