Candor Shrine School: బొట్టు పెట్టుకుని వచ్చారని విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపల్
బొట్టు పెట్టుకుని వచ్చారని విద్యార్థులను ప్రిన్సిపల్ చితకబాదారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బొట్టుపెట్టుకుని వచ్చారని విద్యార్థులను చితకబాదాడు ఓ ప్రిన్సిపాల్. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థులను వాష్ రూమ్ లోకి తీసుకువెళ్లి బలంతంగా బొట్టు తీయించాడు. ఈ ఘటన హైదరాబాద్ పెద్దఅంబర్ పేట్ (pedda amberpat) కండర్ షైన్ స్కూల్ (Candor Shrine School) లో చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ వద్దకు చేరుకుని ప్రిన్సిపాల్ దాష్టీకంపై ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ (Principal) ఇప్పటి వరకు ఇలా పిల్లలను కొట్టడం ఇది మొదటిసారి కాదని గతంలో నాలుగు సార్లు ఇలానే దాడి చేశారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఇదేమని ప్రశ్నించేందుకు వస్తే స్కూల్ యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకలు ఆందోళనతో స్కూల్ యాజమాన్యం స్పందించింది. ప్రిన్సిపాల్ ప్రవర్తన గతంలో తమ దృష్టికి రాలేదని, ఇప్పుడు ఆ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తమ స్కూల్ లో ఇటువంటి వాటిని ప్రోత్సహించమని క్లారిటీ ఇచ్చింది. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్ వద్దకు చేరుకున్నారు.