కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలి: Y. S. Sharmila
ప్రధాని మోడీ హైదరాబద్‌కు వస్తునందున కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై ప్రాజెక్ట్ పై కాంట్రాక్టర్ మేఘ కృష్ణారెడ్డి, సీఎం కేసీఆర్ పై సీబీఐ చేత విచారణ జరిపించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ హైదరాబద్‌కు వస్తునందున కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై ప్రాజెక్ట్ పై కాంట్రాక్టర్ మేఘ కృష్ణారెడ్డి, సీఎం కేసీఆర్ పై సీబీఐ చేత విచారణ జరిపించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశంలోనే అతిపెద్ద స్కాం అన్నారు. ఇదే విషయంపై గతంలో తాము తెలంగాణ గవర్నర్, ఢిల్లీలో సీబీఐకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రస్తుతం ఓ తెల్ల ఏనుగుల మారిందని అన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. కుక్క తోక తగిలితే కూలిపోయే పరిస్థితిలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ఉందన్నారు. పంప్ హౌజ్‌ల నిర్మాణం కూడా క్వాలిటీ లేకుండా నిర్మించారని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
వైఎస్‌రాజశేఖర్ రెడ్డి అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన చేశారని, 38 వేల కోట్లతో 16 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా డిజైన్ చేయించారని వైఎస్ షర్మిల చెప్పారు. వైఎస్ బతికి ఉన్న సమయంలోనే దాదాపు 7 వేల కోట్లు ఖర్చు కూడా చేశారని, ఆ మేరకు పనులు కూడా జరిగాయన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే పూర్తిగా ఆ ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేయించారని చెప్పారు. లక్షా 20 వేల కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని తీసుకెళ్లారని, కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కట్టారని ఆరోపించారు. అవసరం లేకున్నా.. అనవసరమైన బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్ హౌజ్‌లు, మోటార్లు నిర్మించారని చెప్పారు. కమీషన్లు తీసుకునే విధంగా ప్రాజెక్టును రీ డిజైన్ చేయించారని విమర్శించారు.
మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తే రాబోయే రోజుల్లో ఇంకెన్నీ ఘోరాలు చూడాలని ప్రశ్నించారు. దేశానికి సంబంధించిన లక్షల కోట్ల డబ్బు వృధా చేస్తుంటే.. ఇంత అవినీతి జరుగుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఏం చేస్తుందని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వాచ్ డాగ్‌లా ఉండాల్సిన అవసరం కేంద్రానికి లేదా..? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రులే కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి, ఆరోపణలు చేస్తున్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ దొందూ దొందే అన్నారు. బీఆర్ఎస్ కు ఎంఐఎం పార్టీ నేరుగా మద్దతు ఇస్తుంటే.. బీజేపీ మాత్రం రహస్యంగా మద్దతు ఇస్తోందన్నారు. అందుకే ప్రధాని మోదీ... సీఎం కేసీఆర్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పారు.