మానవ అక్రమ రవాణా నిరోధం.. డీజీపీ అంజనీ కుమార్ కీలక వ్యాఖ్యలు
మానవ అక్రమ రవాణా నిరోధంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్టు డీజీపీ అంజనీకుమార్చెప్పారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : మానవ అక్రమ రవాణా నిరోధంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్టు డీజీపీ అంజనీకుమార్చెప్పారు. మానవ అక్రమ రవాణాను అరికట్టటానికి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకుని క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. అప్పడే మరిన్ని ఫలితాలను సాధించవచ్చని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా మహిళా భద్రతా విభాగం, బచ్పన్ బచావ్ ఆందోళన్ స్వచ్ఛంధ సంస్థతో కలిసి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ – రెస్క్యూ– పునరావాసంపై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
సమాజానికి ముప్పుగా పరిణమించిన మానవ, పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసుశాఖ, స్వచ్ఛంధ సంస్థలు కలిసికట్టుగా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షిఖా గోయల్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను అరికట్టటానికి నిర్వహిస్తున్న అన్ని కార్యకలాపాలకు సంబంధించి మహిళా భద్రతా విభాగం నోడల్ ఏజన్సీగా పని చేస్తోందని చెప్పారు. అన్ని జిల్లాల్లో పోలీసుశాఖ తరఫున యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు పని చేస్తున్నట్టు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి యూనిట్లు లేవని తెలిపారు. మానవ అక్రమ రవాణాపై తెలంగాణ పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తున్నట్టు చెప్పారు.
ఈ క్రమంలో గడిచిన రెండేళ్లలో మానవ అక్రమ రవాణాకు సంబంధించి 738 కేసులు నమోదు చేసి 1,961మంది నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. అరెస్టయిన వారిలో 110మందిపై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు రిమాండ్ చేసినట్టు చెప్పారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించటంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసు సిబ్బందికి సహాయం చేస్తున్నట్టు తెలిపారు. ఎన్జీవోల సహకారంతో ఉమెన్ సేఫ్టీ వింగ్ రెస్క్యూ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
మహిళా భద్రతా విభాగం ప్రొఫెషనల్ డేటా మేనేజ్మెంట్ ద్వారా ట్రాఫికింగ్ నెట్వర్క్ను విచ్ఛిన్నం చేయటానికి ప్రత్యేక మెకానిజంను అభివృద్ధి చేసే పనిలో ఉన్నట్టు వివరించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను అరికట్టటానికి చట్టంలో ఉన్న వెసులుబాటు గురించి వివరించారు. ఈ నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ అవయవ వ్యాపారంలో వస్తున్న కొత్త పోకడల గురించి వివరించారు. బాధితులను ఎలా రక్షించవచ్చో చెప్పారు. సదస్సులో ఎన్డీఆర్ఎఫ్ రిటైర్డ్ డీజీ పీ.ఎం.నాయర్, మహిళా భద్రతా విభాగం ఎస్పీ పీ.వీ.పద్మజ, అదనపు ఎస్పీ పీ.అశోక్తదితరులు మాట్లాడారు.