అవిశ్వాసానికి బీఆర్ఎస్ కార్పొరేటర్ల సన్నాహాలు.. నిజామాబాద్ మేయర్‌‌కు బిగ్ షాక్

నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి.

Update: 2024-01-09 01:57 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై మాజీ లైన ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు తమకు ఎన్నికల్లో సహకరించలేదని, వ్యతిరేకంగా పని చేశారని కొందరిని గద్దెదించే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో మున్సిపల్ చైర్ పర్సన్‌ను గద్దెదించడంలో బీఆర్ఎస్ నాయకులు అవలంభించిన ఫార్మూలాను నిజామాబాద్ మేయర్ స్థానంపై అమలు చేసేందుకు యోచిస్తున్నారని సమాచారం. నిజామాబాద్ నగర పాలక సంస్థలో 60 మంది కార్పొరేటర్లు ఉండగా అవిశ్వాసానికి 36 మంది కార్పొరేటర్లు కావాలి. బీజేపీకి ప్రస్తుతానికి 21 మంది కార్పొరేటర్లు ఉండగా.. మిగిలిన ఏడుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్ల మద్దతు కూడగట్టేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా మేయర్ స్థానాన్ని బీజేపీ లేదా బీఆర్ఎస్ చేజిక్కించుకుంటుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.

వేగంగా పావులు...

ఇటీవల బీజేపీలోకి నలుగురు కార్పొరేటర్లు మారగానే నిజామాబాద్ మేయర్ దండు నీతూకిరణ్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. అయితే బీజేపీకి తగినంత బలం లేకపోవడంతో వారు వెనక్కి తగ్గారు. కానీ పావులు మాత్రం వేగంగా కదిలాయి. ఈ నేపథ్యంలో 2019లో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు 28 మందికి గాను 11 మంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో వారిని ఘర్ వాపసీ పేరిట వెనక్కి తెచ్చే ప్రణాళికలు జరుగుతున్నాయి. గత నెలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ మారిన 11 మంది బీజేపీ కార్పొరేటర్లు తిరిగి వస్తామని సంకేతాలు పంపారు.

అయితే కొందరు దళితబంధు లబ్దిదారుల ఎంపిక కోసం వారి నుంచి లక్షల రూపాయలు వసూల్ చేసి బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చిన నేపథ్యంలో ఆ డబ్బులు వచ్చే వరకు వేచి చూసేందుకు సమయం కోరినట్లు తెలిసింది. ఇటీవల నలుగురు బీజేపీ కార్పొరేటర్లు సొంత గూటికి చేరిన తర్వాత మిగిలిన ఏడుగురు పార్టీ మారే విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెల్సిందే. అయితే ప్రస్తుత మేయర్ దండునీతూకిరణ్ భర్త వ్యవహర శైలిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లే ఇప్పుడు చక్రం తిప్పడం విశేషం. 60 స్థానాలు ఉన్న నిజామాబాద్ నగర పాలక సంస్థలో మెజార్టీకి 36 స్థానాలు కావాల్సి ఉంది.

ప్రస్తుతానికి బీజేపీ కార్పొరేటర్లు 21 మంది ఉండగా మిగిలిన ఏడుగురిని రప్పించేందుకు ప్రణాళికలు ఊపందుకున్నాయి. అదే విధంగా ప్రస్తుతానికి బల్ధియాలో ఓటు వేయడానికి ఎక్స్ ఆఫిషియో ఓటును నిజామాబాద్ ఎంపీతో పాటు అర్బన్ ఎమ్మెల్యేకు ఉండడంతో బీజేపీకి అదనపు బలంగా ఉంది. 36 మంది ఓట్లు వేస్తే మేయర్ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉండడంతో ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న మరో ఆరుగురి మద్దతును కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలిసి మేయర్ భర్త కార్పొరేటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసినా రాలేదని సమాచారం.

కానీ కొందరు కార్పొరేటర్లు మేయర్‌ను మార్చాలని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో హైదరాబాద్‌లోనే తేల్చుకునేందుకు ఎమ్మెల్సీ కవితతో పాటు మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తను కలువాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే వారు అనుమతిస్తే మాత్రం కచ్చితంగా మేయర్ మారడం ఖాయంగా ఉంది. అయితే తర్వాత మేయర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటుందా లేక బీఆర్ఎస్ వారే గద్దెనెక్కుతారనేది కాలమే నిర్ణయిస్తుంది.


Similar News