పీపీ, ఏపీసీ నియామకాల్లో ఆంధ్ర కేడర్‌కు ప్రాధాన్యత

బీఆర్ఎస్ ప్రభుత్వంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ), అడిషనల్ ప్రాసిక్యూటర్ పోస్టుల (ఏపీపీ) నియామకాల్లో అలసత్వం వహించారని కాంగ్రెస్ జాతీయ లీగల్ సెల్ కో ఆర్డినేటర్ దామోదర్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-06-20 13:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ప్రభుత్వంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ), అడిషనల్ ప్రాసిక్యూటర్ పోస్టుల (ఏపీపీ) నియామకాల్లో అలసత్వం వహించారని కాంగ్రెస్ జాతీయ లీగల్ సెల్ కో ఆర్డినేటర్ దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పానలలో ఆంధ్ర కేడర్ ఉద్యోగులకే పెద్దపీఠ వేశారని ఆరోపించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయంలో అన్నీ అక్రమ విధానాలే అమలయ్యాయని పేర్కొన్నారు. వివిధ కోర్టులలో 414 పోస్టులు ఉండగా 50 శాతం పోస్టులు బార్ కౌన్సిల్ ద్వారా నియమించాల్సి ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు ఖాళీల వివరాలను జిల్లా కలెక్టర్లకు లెటర్ రాసి, ప్యానల్‌కు పంపించాలన్నారు. కానీ చాలా వరకు ఖాళీలున్నా, ఇప్పటికీ భర్తీ చేయడం లేదన్నారు.

ఆంధ్ర కేడర్‌కు చెందిన అడిషనల్ ప్రాసిక్యూటర్ వైజయంతి వలనే రిక్రూట్ మెంట్లలో సమస్యలు వస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఆమె తెలంగాణ ప్రాసిక్యూటర్‌లకు అన్యాయం చేసే విధంగా అపాయింట్మెంట్ లు జరగకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. 2017 నుంచి ఇప్పటి వరకు కొనసాగడానికి కారణం కూడా ఇదే అని వివరించారు. 2021లో హైకోర్టు కూడా సీరియస్ కామెంట్స్ చేసిందని, ఖాళీలు భర్తీ జరగాల్సిన అవసరం ఉన్నదని వివరించినట్లు గుర్తు చేశారు. ఈ నెల 22వ తేదీన హోం డిపార్టు మెంట్ ఆధ్వర్యంలో సమావేశం ఉన్నదని, ఈ అంశాన్ని సీఎం, మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఆంధ్ర క్యాడర్ వైజయంతి తెలంగాణ మీద పెత్తనం చూపించడం ఏమిటని ప్రశ్నించారు.


Similar News