ప్రవళిక ఆత్మహత్య.. నిరుద్యోగానికి అద్దం పడుతోంది : ప్రొఫెసర్ కోదండరామ్
టీఎస్పీఎస్సీ రద్దు, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. సడక్ బంద్‌కు ఇవాళ పిలుపునిచ్చిన అఖిల పక్ష నేతలను ఇవాళ ఉదయం నుంచే గృహ నిర్బంధం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్పీఎస్సీ రద్దు, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. సడక్ బంద్‌కు ఇవాళ పిలుపునిచ్చిన అఖిల పక్ష నేతలను ఇవాళ ఉదయం నుంచే గృహ నిర్బంధం చేశారు. టీజేఎస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ప్రజాపంథా, వివిధ ప్రజాసంఘాల నేతలను ప్రొఫెసర్ కోదండరామ్ ఇంటి వద్ద పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. నిన్న ప్రవళిక ఆత్మహత్య నిరుద్యోగుల సమస్యకు అద్దం పట్టిచూపుతున్నాయని తెలిపారు.
నిరుద్యోగులను ప్రభుత్వం అభద్రత భావంలోకి నెట్టేసిందని, వారికి న్యాయం చేయాలని చెప్పి ఇవాళ మేం బయలుదేరితే.. నిరసన తెలిపే హక్కు ప్రభుత్వం మిగిల్చలేదన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులు డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. దసరా పండుగ రోజు నిరుద్యోగులు బంగారం (జమ్మీ) చేతిలో పెట్టేటప్పుడు ప్రభుత్వ వైఖరిని ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఎవరు బలిదానాలకు పాల్పడవద్దని న్యాయం జరిగే వరకు పోరాడుదామని, అఖిలపక్షం తప్పకుండా న్యాయం చేస్తుందని, జరగబోయే ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా నిలబెడుతామని హామీ ఇచ్చారు.
వరుసగా పరీక్షల నిర్వహణలో వైఫల్యం చెందిన టీఎస్పీఎస్సీ చైర్మన్, బోర్డు సభ్యులను తొలగించి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డీఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులను కలుపుకొని 15,000 లకు పెంచాలన్నారు. తర్వాత పరీక్షల రద్దు వల్ల నష్టపోయిన విద్యార్థులకు రూ. 3 లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక ఘటనపై కోదండరామ్ వీడియో విడుదల చేశారు. ప్రవళిక ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమన్నారు. తను టీచర్ నౌకరీ కోసం ప్రయత్నిస్తోందని, ఆ పరీక్షలు వాయిదా పడడంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. ఇప్పటికే 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో కొందరు నిరుద్యోగమే ప్రధాన అంశం అని సూసైడ్ నోట్ రాశారని వెల్లడించారు. అయినా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు.