శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం: సిరిసిల్ల కలెక్టర్
శాంతియుతమైన సమాజమే పోలీసుల లక్ష్యమని, శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల బాధ్యత అని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.
దిశ, సిరిసిల్ల ప్రతినిధి: శాంతియుతమైన సమాజమే పోలీసుల లక్ష్యమని, శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల బాధ్యత అని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో పోలీసు అమర వీరుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పోలీసు అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ... పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజావసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు జాతీయ ఐక్యత కోసం ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇది అభినందనీయమని కలెక్టర్ అన్నారు.
అనంతరం సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ... అక్టోబర్ 21, 1959 సంవత్సరంలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మంది భారత జవాన్లు కలసి లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన వారిపై దాడి చేసి 10 మందిని హతమార్చినదన్నారు. అప్పటి నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్-21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా ప్రభుత్వం పాటిస్తుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గత సంవత్సరం నుండి పోలీస్ ఫ్లాగ్ డేగా జరుపుకుంటున్నామన్నారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికీ చేరుతుంది అనడానికి మన రాష్ట్రమే నిదర్శనమన్నారు. ఈ సమాజం కోరుకునేది శాంతి, స్థిరత్వం,అభివృద్ధి. పోలీస్ శాఖ వారి త్యాగాల ద్వారా ఎన్నో దశాబ్దాలుగా భౌతిక రక్షణ నుండి, సామాజిక రుగ్మతలను పారద్రోలడం వరకు పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యదీక్షతో, సేవాతత్పరతతో పని చేస్తుందన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణార్థం పోలీస్ ఫ్లాగ్ డేను ఘనంగా నిర్వహిస్తోందన్నారు.
అమర వీరులైన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31వ తేదీ జాతీయ ఐక్యత దినోత్సవం వరకు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా తీవ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల్లో 264 మంది పోలీసులు అమరులయ్యారనీ అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని మరియు వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను సర్వస్వం లభింపచేయడం, ఆయా కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమర వీరులకు మనం అందించే నిజమైన నివాళి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో 8 మందికి పైగా పోలీసులు అసువులు బాసారని అన్నారు. వారి త్యాగ ఫలం వల్లే గత 20 సంవత్సరాల కంటే ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. పోలీసుల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అమరులైన కుటుంబాలకు సంబందించిన కుటుంబ సభ్యులు హాజరై నివాళ్ళు అర్పించడం జరిగింది. కలెక్టర్, ఎస్పీలు త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థుతులు వారి సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాధ్యమైనoత తొందరగా పరిష్కరిస్తామని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు విశ్వప్రసాద్, రవికుమార్, ఆర్ఐలు రజినీకాంత్, యాదగిరి, సీఐలు శ్రీలత, వెంకటేష్, బన్సీలాల్, అనిల్ కుమార్, ఉపేందర్, మోగిలి, సర్వర్, నవీన్ కుమార్, లింగమూర్తి, ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.