ఒంటరైన కేసీఆర్..? మాజీ సీఎంతో కేశవరావు, కడియం శ్రీహరి ఫోటోలు వైరల్
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. బీఆర్ఎస్ కీలక నేతలు వరుసగా క్యూ కట్టి కాంగ్రెస్, బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. బీఆర్ఎస్ కీలక నేతలు వరుసగా క్యూ కట్టి కాంగ్రెస్, బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేతలు అయిన పార్టీ జనరల్ సెక్రటరీ కేశవరావు, మాజీ మంత్రి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీని వీడారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇటీవల పార్టీని వీడిన కీలక నేతల కంటే కేశవరావు, కడియం శ్రీహరి పార్టీ వీడడం మరింత చర్చానీయాంశంగా మారింది. కారణం వీరు మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు.
ఇద్దరు నేతలు కూడా 2013 లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేశవరావు కాంగ్రెస్ పార్టీ, కడియం శ్రీహరి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి వారు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగానే మెలిగారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో 26-8-2017లో తెలంగాణ భవన్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో కేశవరావు, కడియం శ్రీహరి నవ్వుతూ ఉన్న ఫోటో వైరల్‌గా మారింది. గతంలో పదవులు అనుభవించిన నేతలు నేడు కేసీఆర్‌ను ఒంటరి చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.