HYD Metro: మెట్రో రైల్‌కు ఏడేళ్లు.. ఘనంగా వార్షికోత్సవాలు

ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) 7వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది.

Update: 2024-11-29 01:50 GMT

దిశ, సిటీ బ్యూరో : ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) 7వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానం కింద చేపట్టిన ప్రపంచంలోనే అతి పెద్ద మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇది. ప్రాజెక్టు ప్రారంభం నుంచి దార్శనికత, సాటిలేని నిబద్ధతతో సంస్థ ముందుకు సాగుతోందని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ శ్రీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. ఇది ట్రాఫిక్ ను గణనీయంగా తగ్గించడంతో పాటు, వాయు కాలుష్యాన్ని నివారించిందని పేర్కొన్నారు.

ప్రాజెక్టు అమల్లో ఎదురైన పలు సవాళ్లను ఎల్ అండ్ టీ ఎం ఆర్ హెచ్ ఎల్ ఎండీ & సీఈవో కేవీబీ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘హైదరాబాద్ మెట్రో రైల్‌ను తీర్చిదిద్దే ప్రస్థానమనేది ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యల శక్తికి నిదర్శనం. సంక్లిష్టమైన ఇంజినీరింగ్ విన్యాసాలు మొదలుకుని కఠినతరమైన గడువుల వరకు అనేక సవాళ్లను ఎల్అండ్‌టీ తమ కన్సార్షియం భాగస్వాములతో కలిసి అధిగమించింది. మా ఇంజినీరింగ్ సామర్థ్యాలకే గాక ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడంలో తమకు గల నిబద్ధతకు ఈ ప్రాజెక్టు నిదర్శనంగా నిలుస్తుంది. హైదరాబాద్ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, నగర సుస్థిర వృద్ధికి దోహదపడటంలో కీలకపాత్ర పోషించడం మాకెంతో గర్వకారణం’ అని తెలిపారు.

  • హరిత మైలురాయి : మెట్రో మూడు కారిడార్ల వ్యాప్తంగా మొత్తం 57 స్టేషన్లకు ఐజీబీసీ ప్లాటినం సర్టిఫికేషన్ లభించడమనేది గర్వించదగ్గ విశేషం. భారత్‌లో ఈ ఘనతను సాధించిన ఏకైక మెట్రో ఇదే కావడం గమనార్హం.
  • రికార్డు స్థాయి రైడర్‌షిప్ : మెట్రో నిలకడగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. సగటు రోజువారీ రైడర్‌షిప్ 4.75 లక్షల ప్రయాణికులను మించి ఉంటోంది. 2024లో గరిష్ట రైడర్‌షిప్ 5.63 లక్షల ప్రయాణికులుగా (7.43 లక్షల ప్యాసింజర్ ట్రిప్‌లు) నమోదైంది.
  • ప్రయాణికులపరంగా మైలురాయి : ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్ మెట్రో రైల్‌లో 63.5కోట్ల మంది పైగా ప్యాసింజర్లు ప్రయాణించారు.
  • రోజువారీ ట్రైన్ కిలోమీటర్లు: 25,600 కిలోమీటర్లు.
  • ఫ్లీట్ వినియోగం: పూర్తి స్థాయిలో సేవలు అందించేలా పీక్ అవర్స్‌లో 100శాతం
  • శ్రేష్ఠమైన నిర్వహణ మెట్రో రైళ్లు మొత్తం మీద 44.2 మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి.
  • సగటు ట్రిప్ నిడివి 12.5 కిలోమీటర్లు.
  • సమయపాలన 99.8శాతం ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్.
  • మెట్రో సుమారు 184 మిలియన్ లీటర్ల ఇంధనం ఆదా అయ్యేందుకు తోడ్పడింది.
  • సౌర విద్యుత్పత్తి : డిపోలు మరియు 32 స్టేషన్ రూఫ్‌టాప్‌ల వ్యాప్తంగా 9.35 ఎండబ్ల్యూ పీ సామర్థ్యాలతో సౌర విద్యుదుత్పత్తి సాధనాలు ఏర్పాటు చేయబడ్డాయి. మెట్రోకి సంబంధించి 12శాతం విద్యుత్ అవసరాలను ఇవి తీరుస్తున్నాయి. ఇప్పటివరకు 56,935 ఎండబ్ల్యూ హెచ్ సౌర విద్యుత్ ఉత్పత్తి చేయబడింది.
  • రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ : విద్యుత్ వినియోగ సామర్థ్యాలను మెరుగుపర్చేలా మెట్రో రైళ్లలో అమర్చిన వినూత్నమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం మొత్తం 220 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది.
  • నీటి ఆదా కార్యక్రమాలు : డిపోలు, స్టేషన్లవ్యాప్తంగా 150 పైగా రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేయబడ్డాయి. సుస్థిర నీటి నిర్వహణకు తోడ్పడేలా ఇవి 3,75,000 కిలోలీటర్ల వర్షపు నీటిని విజయవంతంగా హార్వెస్ట్ చేశాయి.
  • సర్వీస్ డెలివరీ: ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు గల హాంకాంగ్ మరియు సింగపూర్ మెట్రో సిస్టమ్‌లతో పోల్చి చూడగలిగే విధంగా 99.9% విశ్వసనీయత.
  • కాంటాక్ట్‌లెస్ టికెటింగ్: టోకెన్లు, స్మార్ట్‌కార్డులు, ఎన్ఎఫ్‌సీ అనుగుణమైన క్యూఆర్ ఆధారిత మొబైల్ మరియు పేపర్ టికెట్లు, వాట్సాప్ ఈ-టికెట్లు, గూగుల్ వాలెట్ మరియు త్వరలో అందుబాటులోకి రానున్న ఓపెన్ లూప్ టికెటింగ్ వంటి ఫీచర్లు మరియు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు.
  • సుస్థిరత: ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం హైదరాబాద్ మెట్రో మౌలిక సదుపాయాలు కల్పించింది. నెట్‌వర్క్‌వ్యాప్తంగా 50 పైగా చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి.
  • ప్రయాణికులకు ఆఫర్లు: మరింత అందుబాటు చార్జీల్లో ప్రయాణం చేసే విధంగా ఆఫ్-పీక్ సమయాల్లో ప్యాసింజర్లు డిస్కౌంట్లు పొందవచ్చు. అలాగే, ప్రజా రవాణా వ్యవస్థను ఎంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించే విధంగా డిస్కౌంట్ రేట్లకు స్పెషల్ స్టూడెంట్ పాస్‌లు అందించబడుతున్నాయి. మారుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ, వినూత్నత, సుస్థిరతకు హైదరాబాద్ మెట్రో రైల్ కట్టుబడి ఉంది. మరింత మెరుగైన ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ వ్యవస్థ సర్వసన్నద్ధంగా ఉంది.
Tags:    

Similar News