Vikarabad: నత్త నడకన భవన నిర్మాణాలు.. బేస్మెంట్‌కే పరిమితం
పెద్దేముల్ మండలంలోని ఎర్రగడ్డ తండా (అత్కూర్ తండా) గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక పాఠశాల భవనం పనులు నత్త నడకగా సాగుతున్నాయి.
దిశ, పెద్దేముల్: పెద్దేముల్ మండలంలోని ఎర్రగడ్డ తండా (అత్కూర్ తండా) గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక పాఠశాల భవనం పనులు నత్త నడకగా సాగుతున్నాయి. పాత పాఠశాల భవనం మరమ్మతుల కారణంగా నూతన భవనం నిర్మించేందుకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనులు ప్రారంభించిన సదరు కాంట్రాక్టర్ ఏండ్లు గడుస్తున్నా నేటికీ పూర్తి చేయలేదు. దీంతో పాఠశాల భవన నిర్మాణం బేస్మిట్, పిల్లార్ల వరకే నిలిపోయింది. ఎర్రగడ్డ తండా (అత్కూరు తండా) ప్రాథమిక పాఠశాల భవనం నిర్మాణం పనుల్లో జాప్యం జరగడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఆత్కూర్ తండా (ఎర్రగడ్డ తండా)లో ఉన్న ఓ పురాతన కమిటీ హాల్‌లో విద్యార్థులకు తాత్కాలికంగా పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాల భవనం మరమ్మతులకు గురి కావడంతో నాడు ఉన్నతాధికారులు స్పందించి నూతన భవనం నిర్మించేందుకు సుమారు రూ.30 లక్షలు నిధులు మంజూరు చేశారు. అయినా కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణా..? లేక మరేదైనా కారణమో గాని పాఠశాల పనులు మాత్రం బేస్మిట్, పిల్లర్ల వరకే ఆగిపోయాయి. దీంతో విద్యార్థులు విద్య అభ్యసించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిలిచిపోయిన ప్రాథమిక పాఠశాల భవనం నిర్మాణం పనులు ముందుకు సాగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.
పది లక్షలు ఖర్చు చేసినా ఒక్క రూపాయి రాలేదు..
నూతన పాఠశాల భవన నిర్మాణం పనులు చేపట్టడానికి నాటి ప్రభుత్వం రూ.30 లక్షలు కేటాయించింది. బేస్మిట్, పిల్లర్స్ వరకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన. ఇప్పటిదాకా ఒక్క రూపాయి బిల్లు రాలేదు. అందుకే పెట్టుబడికి పైసలు లేకపోవడంతో చేసేదేమీలేక పాఠశాల భవన నిర్మాణ పనులు ఆపేసిన. ఇప్పటికైనా ప్రాజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల భవన నిర్మాణ పనులు ముందుకు సాగడానికి నిధులను మంజూరు చేయాలని కాంట్రాక్టర్ సురేశ్ కోరుతున్నారు.