Education: హాస్టళ్లపై ప్రత్యేక నిఘా..! పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ గురుకుల వసతి గృహాల్లో నాణ్యమైన భోజనంతో పాటు విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది.

Update: 2024-11-29 02:01 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో / వికారాబాద్ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ గురుకుల వసతి గృహాల్లో నాణ్యమైన భోజనంతో పాటు విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్ల ఆదేశాల మేరకు ప్రభుత్వ గురుకుల హాస్టళ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం, బాలసదనంలోని చిన్నారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా జిల్లా, మండల స్థాయి అధికారులు అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలలు, బాలసదనాలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నారు. భోజన నాణ్యతలో ఎలాంటి లోపాలు, నిర్లక్ష్యం ఉన్నా వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. అలాగే రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సైతం వివిధ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు. గత బుధవారం వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిగి పట్టణ కేంద్రంలోని బాలసదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలసదనంలోని చిన్నారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులకు సూచించారు. అనాథ చిన్నారులకు మంచి ఆహారాన్ని అందిస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనం అందించాన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారులపై ఎవరు నిర్లక్ష్యం వహించరాదన్నారు.

విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక కమిటీలు..

మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక కమిటీలు వేసి పాఠశాలల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురుకులాల్లో భోజనంతో పాటు హాస్టల్లో సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనం, పాఠశాలల్లో సౌకర్యాలు అన్ని పకడ్బందీగా ఉండేందుకు విద్యా కమిటీ చైర్మన్, స్కూల్ మేనేజ్మెంట్, పేరెంట్స్, విద్యార్థులను భాగస్వాములను చేస్తూ మండలాల స్థాయిలో కమిటీలు వేయాలని ఇప్పటికే కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. డివిజన్ స్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఆర్డీవో, తహశీల్దార్, రెవెన్యూ, విద్యాశాఖ, ఇతర అధికారులతో కలిసి ఒక కమిటీ వేయాలి. జిల్లా స్థాయిలో కూడా జిల్లా అధికారులతో కమిటీలు వేసి ప్రభుత్వ పాఠశాలలను నిత్యం పర్యవేక్షించాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

గురుకుల విదార్థులతో కలిసి అధికారుల నిద్ర..

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మండల, జిల్లా అధికారులకు స్పెషల్ ఆఫీసర్లుగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. జిల్లా అధికారులతో పాటు ఆర్డీవో, తహశీల్దార్ స్థాయి అధికారులు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలను సందర్శిస్తున్నారు. విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేస్తూ ఆ రాత్రి అక్కడే పడుకొని విద్యార్థులకు హాస్టల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు కచ్చితంగా గురుకుల పాఠశాలలకు వెళ్లి అక్కడే రాత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేసి నిద్రపోవాలని కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు అందించే సౌకర్యాలపై ఎవరు నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని స్పష్టమైన ఆదేశాలున్నాయి.

పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు

ప్రధానంగా గురుకులాల్లో, బాలసదనంలో వంట సామాగ్రి నిల్వచేసే పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా బియ్యం, పప్పు లాంటి వాటిలో పురుగు పట్టడం కారణంగానే పిల్లలకు అనారోగ్య సమస్యలు, అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ విషయంలో హాస్టల్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రతలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

దాతలు ముందుకు రావాలి..

ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసినప్పటికీ నిధుల కొరతతో అది వంద శాతం సాధ్యం కావడం లేదు. దీని కారణంగా కూడా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అసలే చలికాలం కావడం.. ఉమ్మడి జిల్లాలలోని కొన్ని గురుకులాల విద్యార్థులకు సరైన దుప్పట్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు అనేక వార్తలు ప్రచురితం అవుతున్నాయి. అలాగే డోర్లు, కిటికీలు సరిగా లేక విద్యార్థులు చలిలో వణికిపోతున్న పరిస్థితులున్నాయి. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందని అధికారులు కోరుతున్నారు.

Tags:    

Similar News