PCC Chief : ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికపై జిల్లాల నేతలతో పీసీసీ చీఫ్ కీలక భేటీ
రాష్ట్రంలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక, నామినెటెడ్ ఖాళీల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్మాణం అంశాలపై పీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్(B. Mahesh Kumar Goud)గాంధీభవన్ లో ఈ రోజు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక, నామినెటెడ్ ఖాళీల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్మాణం అంశాలపై పీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్(B. Mahesh Kumar Goud)గాంధీభవన్ లో ఈ రోజు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. శాసనమండలిలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు టీ. జీవన్ రెడ్డి (కాంగ్రెస్), ఇదే జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిల పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనున్నది. ఈ తేదీ నాటికి వీరి స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను డిసెంబర్ 30న ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మెదక్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ(Graduate MLC) ఎన్నికకు సంబంధించి మంత్రులు, ఇంచార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండ సురేఖలు సమావేశానికి హాజరయ్యారు. ఆ జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల స్ధానానికి పార్టీ అభ్యర్థి ఎంపిక, గెలుపు వ్యూహాల అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన ఈ ఎమ్మెల్సీ స్ధానానికి వెలిజాల రాజేందర్, విద్యా సంస్థల అధినేత నరేందర్, కేకే మహేందర్ రెడ్డి సహా పలువురు ఆశావహులు టికెట్ ఆశిస్తున్నారు. అయితే తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికే మరోసారి టికెట్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికతో పాటు మార్చిలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలపైన, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన తరహాలోనే తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.