KTR: కలెక్టర్ పై వ్యాఖ్యల ఎఫెక్టు.. కేటీఆర్ పై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం
కేటీఆర్ పై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: సిరిసిల్ల కలెక్టర్ ను ఉద్దేశించి మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితం అని, సివిల్ సర్వీస్ అధికారిపై ఆయన చేసిన విమర్శలు ఆయన విశ్వసనీయతను ప్రశ్నించే విధంగా ఉన్నాయని తప్పుబట్టింది. సిరిసిల్ల కలెక్టర్ కు అండగా నిలుస్తామని పేర్కొంది. కలెక్టర్ విధులను రాజకీయంగా వక్రీకరించడం సరికాదని ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్నిచూపుతాయని పేర్కొంది. కేటీఆర్ తన ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. సివిల్ సర్వీస్ అధికారుల గౌరవాన్ని కాపాడటానికి తాము అండగా నిలబడతామని స్పష్టం చేసింది.
కాగా రెండు రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ను ఉద్దేశించి 'కొత్త కలెక్టరేట్ లో కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు.ఆయన మన కార్యకర్తలను పార్టీ మారాలని నేరుగా మాట్లాడుతున్నాడు. ఇటువంటి సన్నాసని కలెక్టర్ గా తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం ఫరక్ పడదు. బీఆర్ఎస్ వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు. ఎన్నిరోజులు ఈ కలెక్టర్లు, ఈ అధికారులు, పోలీసుల డ్రామాలు ఎన్ని రోజులో చూద్దాం, రాసిపెట్టుకోండి. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం' అని హెచ్చరించారు.