పార్టీ చీఫ్ చేంజ్.. అయినా స్టేట్ బీజేపీ సెట్ కాలే!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానం తొలగించినా పార్టీలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానం తొలగించినా పార్టీలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది. బండి సంజయ్‌ను ఆ పదవి నుంచి తొలగించి కిషన్‌రెడ్డిని నియమించినా పార్టీలో భేదాభిప్రాయాలు, కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర మంత్రి పదవి వదులుకోవడానికి కిషన్‌రెడ్డి ఇబ్బంది పడుతుంటే కేబినెట్‌లో చేరడానికి బండి సంజయ్ ఆసక్తి చూపడం లేదు. సాధారణ కార్యకర్తగానే తాను పార్టీ కోసం పని చేస్తానని అధిష్టానం వద్ద బండి సంజయ్ చెప్పినట్లు టాక్.
దీంతో సంజయ్ కాదంటే తెలంగాణ నుంచి కేబినెట్ లో చేరేదెవరు అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కొత్త అధ్యక్షుడిని నియమిస్తూ పార్టీ హైకమాండ్ ఆదేశించినా జిల్లా, రాష్ట్ర స్థాయి నేతల్లో జోష్ కనిపించడం లేదు. పార్టీ స్టేట్ ఆఫీస్ బోసిపోయింది. కటౌట్‌లు, ఫ్లెక్సీలు, హడావుడి, హంగామా, సందడి.. ఇలాంటివేవీ లేకుండా వెలవెలబోతున్నది. పార్టీలో నేతల మధ్య గ్యాప్ అదే స్థాయిలో కంటిన్యూ అవుతున్నది. సీనియర్ నేతలు ఉంటారో పోతారో అనే చర్చ తీవ్ర స్థాయిలో మొదలైంది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రెండు ప్రత్యర్థి పార్టీలకు దీటుగా గెలుపు కోసం పనిచేయాలన్న ఉత్సాహం శ్రేణుల్లో కనిపించడంలేదు. సీనియర్ నేత విజయశాంతి ఇప్పటికే తన ఆవేదనను వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాకు చెందిన నేత తాజా మార్పులపై పెదవి విరిచారు. రఘునందన్‌రావు కామెంట్లు సరేసరి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్, డీకే అరుణ.. ఇలా అనేక మంది సీనియర్ నేతలపైనా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గాడిలో పెట్టాల్సిన అధ్యక్షుడు కిషన్‌రెడ్డే అలగడంతో నేతల్లోనూ వారివారి స్థాయిలో నిరుత్సాహం, నైరాశ్యం వ్యక్తమవుతున్నది.
కిషన్ రెడ్డిపై సాఫ్ట్ కార్నర్ ముద్ర
కిషన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఇకపైన ఎలా దూకుడుగా వ్యవహరిస్తుందన్నదే చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉంటారని, సాఫ్ట్‌గా వ్యవహరిస్తారన్న ముద్ర ఉన్నది. ఎన్నికల్లో పాజిటివ్ ఫలితాలు రాకపోతే అపవాదును మూటగట్టుకోవాల్సి ఉంటుంది. అన్ని స్థాయిల్లోని నేతలను కలుపుకుపోయేలా, వారి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడం కిషన్‌రెడ్డిగా సవాల్‌గా మారింది.
అయిష్టంగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తున్నందున కింది స్థాయి నుంచి ఆయనకు లభించే సహకారం కూడా ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర అధ్యక్ష పదవి పేరుతో కేంద్ర మంత్రి పదవిని తీసేసి డిమోట్ చేశారన్న అభిప్రాయం కిషన్‌రెడ్డి అభిమానుల్లో వ్యక్తమవుతున్నది. కేంద్ర నాయకత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర యూనిట్‌లో మాత్రం విభేదాలు, అసంతృప్తులు షరా మామూలు తరహాలో కొనసాగుతున్నాయి.