TSPSC పేపర్ లీక్ కావడానికి ముఖ్య కారణం అదే: తమ్మినేని వీరభద్రం
పేపర్ లీకేజీలో టీఎస్‌పీఎస్‌సీ నిర్లక్ష్యంగా వ్యహరించడంపై పలు అనుమానాలు ఉన్నాయని, లీకేజీ అయిన పేపర్ల పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: పేపర్ లీకేజీలో టీఎస్‌పీఎస్‌సీ నిర్లక్ష్యంగా వ్యహరించడంపై పలు అనుమానాలు ఉన్నాయని, లీకేజీ అయిన పేపర్ల పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్ ఇంజనీర్ పశ్నాపత్రాల లీకేజీలో టీఎస్‌పీఎస్‌సీ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశతో ఎదురుచూస్తున్నారని, హాస్టల్స్‌లో ఉంటూ, కోచింగ్‌లకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ నానా ఇబ్బందులు పడ్డ నిరుద్యోగులకు ఈ ఘటన తీవ్ర నష్టం, మనస్థాపాన్ని కలిగించిందన్నారు.
విచారణకోసం ఏర్పాటు చేయబడ్డ సిట్ 8 మంది నిందితులను రిమాండ్‌కు పంపడంతోనే సరిపెట్టకుండా, నియామకాల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఎస్‌పీఎస్‌సీ బోర్డు చైర్మన్, కమిషన్, కార్యదర్శి, మొత్తం సభ్యుల పాత్రపై విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిపార్టుమెంట్ వ్యవహారాలు, పరీక్ష పేపర్లు, కీలకమైన పాస్‌వర్స్డ్ కమిషన్ లేదా ఛైర్మన్, సెక్రటరీలకు మాత్రమే తెలుస్తాయని, కానీ సెక్షన్ ఆఫీసర్ ఇంత కీలకమైన పేపర్లను ఫోటో తీసుకున్నాడంటే అక్కడ వాటికి భద్రత కల్పించడంలో బాధ్యులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థమవుతుందన్నారు. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షా పేపర్లు కూడా లీకైనట్లుగా వస్తున్న వార్తలపై కూడా బోర్డు పూర్తి వివరణ ఇవ్వాలని, ఈ అక్రమాలకు పాల్పడ్డ నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.