స్కూల్ బిల్డింగ్ పై నుంచి పడి పెయింటర్ మృతి
నిజామాబాద్ నగర శివారులోని నవ్య భారతి గ్లోబల్ స్కూల్ బిల్డింగ్ పైనుంచి పడి పెయింటర్ మృతి చెందారు.
దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగర శివారులోని నవ్య భారతి గ్లోబల్ స్కూల్ బిల్డింగ్ పైనుంచి పడి పెయింటర్ మృతి చెందారు. ఈ సంఘటన కార్మిక దినోత్సవం మే డే (సోమవారం) నాడు జరిగింది. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. మాక్లూర్ మండలం అమ్రద్ గ్రామానికి చెందిన నిమ్మ రాజ్ అరుణ్ (23) సోమవారం నవ్య భారతి గ్లోబల్ స్కూల్లో పెయింటింగ్ పనులు చేస్తూ నాలుగో అంతస్తు నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు.
అతడిని యాజమాన్యం వైద్యం కోసం మనోరమ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ మేరకు అతని తల్లి సావిత్రి మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన కొడుకును మేడే నాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పెయింటింగ్ పనులు చేయించారని ఆరోపించారు. కనీసం తన కొడుకు గాయపడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని కూడా యాజమాన్యం రహస్యంగా ఉంచిందని తెలిపారు. తన కొడుకు మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును రాజీ కుదుర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.