బీఆర్ఎస్‌లో మరో కలకలం.. పుట్ట మధుపై MPP సంచలన వ్యాఖ్యలు
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి వేధింపుల ఉదంతం మరువకముందే మరో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, పెద్దపల్లి/రామగిరి: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి వేధింపుల ఉదంతం మరువకముందే మరో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా పరిషత్చైర్మన్ పుట్ట మధు, కమాన్పూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణలతో తనకు ప్రాణహాని ఉందంటూ రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క ఆరోపించారు. ఈ మేరకు ఆమె తన భర్త కొమురయ్యతో కలిసి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుతో ప్రాణ హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై రామగుండం సీపీని కలుస్తానని, పుట్ట మధు వ్యవహారాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.
గత 15 ఏళ్లుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ పార్టీ కోసం పనిచేస్తున్నామని అన్నారు. తాను రామగిరి ఎంపీపీగా గెలిచినప్పటి నుంచి, ఇక్కడ ఓడిపోయిన ఎంపీటీసీ పూదరి సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి అనుచరులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. పుట్ట మధు ఆదేశాల ప్రకారం తమను టార్చర్ చేస్తున్నారని అన్నారు. ఎంపీపీ పోస్టు కోసం పొలం అమ్మి వైస్ ఎంపీపీకి రూ.10 లక్షలు ఇచ్చామని, అయినా మిగతా ఎంపీటీసీలను నా మీదకు ఉసిగొల్పి డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. రామగిరి మండలం మొత్తం పుట్ట మధు అనుచరుడైన సత్యనారాయణ తన గుప్పిట్లో పెట్టుకొని అధికారులను భయబ్రాంతులకు గురిచేసి తమ మీదకు ఉసిగొల్పుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.
ఒక మహిళా ఎంపీపీని అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో తనపై బూతు రాతలు రాయిస్తున్నారని ఆవేదన చెందారు. సొంత పార్టీ నేతలే తమను టార్గెట్ చేశారని అన్నారు. చెక్ బౌన్స్ కేసు విషయంలో జెడ్పీ ఆఫీస్‌లో మాట్లాడుదాం అని పుట్ట మధు తమను పిలిచి మహిళను అని కూడా చూడకుండా బూతులు తిట్టాడని వాపోయారు. నాకు ఎదురు తిరిగితే వామన్ రావు దంపతులకు పట్టిన గతే మీకూ పడుతది హెచ్చరించాడని దేవక్క రోధించింది. తాను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేసీఆర్‌ను కలిసి పుట్ట మధు తనతో మాట్లాడిన మాటలు వినిపిస్తానని అన్నారు. పుట్ట మధుతో పాటు పూదరి సత్యనారాయణ నుంచి తమకు ప్రాణాపాయం ఉందని అన్నారు.