E-car Racing స్కామ్.. అబ్బాయిని ఓవర్ కాన్ఫిడెన్సే దెబ్బకొట్టిందా..?

ఫార్ములా ఈ-రేసింగ్ విషయంలో నాడు మంత్రి హోదాలో కేటీఆర్ ఓవర్ కాన్ఫడెన్స్‌తో నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2024-11-09 02:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ-రేసింగ్ విషయంలో నాడు మంత్రి హోదాలో కేటీఆర్ ఓవర్ కాన్ఫడెన్స్‌తో నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెనుకా ముందు ఆలోచించకుండా తీసుకున్న డెసిషన్ అటు పార్టీకి ఇటు వ్యక్తిగతంగా ఆయనకు సైతం సమస్యగా మారిందని చర్చ జరుగుతున్నది. గతేడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతోన్న సమయంలో ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ గుట్టుచప్పుడుగా ఫార్ములా ఈ-రేసింగ్ కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.55 కోట్లు చెల్లించారు. ఆ చెల్లింపులే ఇప్పుడు కేటీఆర్‌కు పెద్ద సమస్యగా మారింది. త్వరలో ఆయన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరందుకున్నది.

కొంపముచ్చిన అతి విశ్వాసం:

గతేడాది సెప్టెంబరు– డిసెంబరు మధ్య రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్నది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంటే, ముచ్చటగా మూడోసారి పవర్‌లోకి వస్తామని ధీమా గులాబీ లీడర్లలో కనిపించింది. సరిగ్గా ఆ టైమ్‌లోనే అక్టోబరు 5, 11 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ- రేసింగ్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు చెల్లించింది. సెక్రెటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం అంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరగాలంటే కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కానీ ఆ నిధుల మంజూరు చేసేందుకు మంత్రివర్గం నుంచి ఆమోదం తీసుకోలేదు. కనీసం పైనాన్స్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ అడగలేదు. మళ్లీ అధికారంలోకి వస్తామని అతి ధీమాతో ఫార్ములా ఈ-రేసు నిర్వహణ సంస్థకు డబ్బులు చెల్లించాలని మంత్రి హోదాలో కేటీఆర్ మౌఖికంగా ఆదేశించడం, సెక్రెటరీ హోదాలో అర్వింద్ కుమార్ చెల్లించడం చకచకా జరిగిపోయాయి. అప్పటి ఆ అతి విశ్వాసం వల్లే ఇప్పుడు కేటీఆర్, అర్వింద్ చిక్కుల్లో ఇరుక్కున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పార్టీకి చెడ్డ పేరు వచ్చిందనే ఆవేదన:

ఈ-కార్ల రేసు కోసం డబ్బులు చెల్లించాలని మంత్రి హోదాలో ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను ఆదేశించానని కేటీఆర్ ఒప్పుకోవడం వల్ల పార్టీకి నష్టం తెచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వినబడుతున్నాయి. అంతటి డబ్బును పేద ప్రజలకోసమో లేకపోతే ఇతర సంక్షేమ పథకాల కోసమో చెల్లించి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే కేసులు, అరెస్టులను తిప్పికొట్టే చాన్స్ ఉండేదని, కానీ ఆ డబ్బు ఈ-రేసు నిర్వహణ కోసం చెల్లించడమే పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. ఉన్నఫళంగా ఈ-కార్ల రేసింగ్ సీజన్-2 ఒప్పందం నుంచి గ్రీన్‌కో సంస్థ తప్పుకోకుండా మంత్రి చొరవ చూపించడంలో ఫెయిల్ అయ్యారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. దేశవిదేశాల్లో పలు బిజినెస్ కంపెనీలతో తమ నేతకు విస్తృత పరిచయాలు ఉన్నాయంటూ కేటీఆర్ సన్నిహితులు గొప్పగా చెప్తుంటారు. మరి గ్రీన్‌కో సంస్థ ఈ-రేసింగ్ ఒప్పందం నుంచి తప్పుకోగానే, ఆ స్థానంలో మరో కంపెనీతో ఎందుకు ఒప్పందం చేయించలేకపోయ్యారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


Similar News