Hydra: మా చెరువు కనిపించడం లేదు.. ఆచూకీ కనిపెట్టండి.. బీజేపీ నేత ఫిర్యాదు
మహేశ్వరంలో తుమ్మల చెరువు కనిపించడం లేదని, కబ్జాలకు గురి చేసి వెంచర్లు వేశారని మహేశ్వరం బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మహేశ్వరంలో తుమ్మల చెరువు కనిపించడం లేదని, కబ్జాలకు గురి చేసి వెంచర్లు వేశారని మహేశ్వరం బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు అన్నారు. ఈ మేరకు పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు పలువురు తుక్కుగూడ గ్రామస్థులు ఉన్నారు. మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ వద్ద 8 ఎకరాల్లో ఉన్న తుమ్మల చెరువు భూమి ఆక్రమణలకు గురైందని, అక్రమణదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు చెరువును కబ్జా చేసి వెంచర్లు వేశారని, దీంతో పంటలు మునిగి రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై పలు మార్లు ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన లాభం లేకపోయిందని, దయచేసి తుమ్మల చెరువు ఆచూకీ కనిపెట్టాలని పోలీసు అధికారిని కోరారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులు, కుంటల రక్షణే ప్రధాన ధ్యేయంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతూ హైడ్రా ఆద్వర్యంలో ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా చెరువులు కుంటలు కబ్జాలకు గురైతే ఫిర్యాదు చేయాలని, వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.