లక్ష సాయం.. అప్లై చేసుకున్న వారికి అందాలంటే పుష్కరకాలం!
బీసీ కుల, చేతి వృత్తిదారుల కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష సాయం స్కీమ్ అమలుపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో : బీసీ కుల, చేతి వృత్తిదారుల కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష సాయం స్కీమ్ అమలుపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. దరఖాస్తుల స్వీకరణ నుంచే ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టింది. అప్లయ్ చేసుకునేందుకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికేట్స్ కోసం ప్రజలు తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేశారు. అదేసమయంలో దశాబ్ది వేడుకల్లో రెవెన్యూ స్టాప్ బిజీగా ఉండటంతో చాలా మందికి ఆ ధ్రువీకరణ పత్రాలు అందలేదు. దీంతో దరఖాస్తు గడువు పెంచాలని డిమాండ్ వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
స్కీమ్ పూర్తయ్యేందుకు పుష్కరకాలం
ప్రతి ఏటా 40 వేల మందికి చొప్పున ఆర్థిక సాయం అందిస్తే స్కీమ్ పూర్తవడానికి 12 ఏండ్లకు పైగానే పడుతుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ పథకానికి మొత్తంగా 5.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీరందరికి ఆర్థిక ప్రయోజనం కల్పించాలంటే రూ.5.5 వేల కోట్లు అవసరం. కానీ ప్రభుత్వం ప్రస్తుతం కేవలం రూ.400 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇలాగే ప్రతి ఏటా నిధులు రిలీజ్ చేసుకుంటూ పోతే స్కీమ్ పూర్తవడానికి 12 ఏండ్లకు పైగానే సమయం పడుతుందని టాక్.
ఈనెల 15న ఎంతమందికి ఆర్థిక సాయం?
ఈ స్కీమ్ నిరంతరంగా కొనసాగిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రతి నెలా ఎంపిక ప్రక్రియను చేపట్టి ఆ నెల 15న లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేస్తామని తెలిపింది. మరి ఈనెల 15న ఎంత మందికి ఆర్థిక సాయం చేస్తారనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం రూ.400 కోట్లను రిలీజ్ చేసింది. ఈ నిధులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 40 వేల మందికి ప్రయోజనం అందనుంది. అంటే ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు సుమారు 300 మందికి మాత్రమే ఆర్థిక సాయం అందనున్నది.