MLC Kavitha: మార్చి 8 లోపు టైమ్ ఇస్తున్నాం.. రేవంత్ సర్కార్ కు కవిత డెడ్‌లైన్
మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై పోస్టు కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) చెప్పారు. తెలంగాణ జాగృతి (Telangna Jagruti) ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి సేకరించిన 10 వేల పోస్టుల కార్డులను (Post Card Movement) ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) పంపిస్తున్నామని మార్చి 8 లోపు మహిళలకు నెలకు రూ.2500 హామీపై ప్రకటన చేయకపోతే లక్షలాది పోస్టు కార్డులను రాసి ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీకి (Sonia Gandhi) పంపిస్తామని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కవిత.. మహిళలకు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదన్నారు. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని విమర్శించారు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తు చేశారు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదని, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు.
సీఎం అందంగా అబద్దాలు:
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంప్ కు పోలిక లేదని కవిత విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు కేవలం పదుల సంఖ్యలో మహిళలకు తప్ప పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశంలేదన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. వడ్డీ లేని రుణాలపై ప్రభుత్వం అందంగా అబద్ధాలు చెబుతోందని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఎగ్గొట్టిందన్నారు. వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ (Congress Abhayahastam) ఇచ్చిందని అందువల్ల వడ్డీ రాయితీ బకాయిలు విడుదలతో పాటు రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలన్నారు. తక్షణమే పెన్షన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచడంతో పాటు అభయ హస్తం నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వరంగల్ ఎయిర్ పోర్టుకు రాణి రుద్రమాదేవి పేరు:
వరంగల్ ఎయిర్ పోర్టుకు (waragamal Airport) రాణి రుద్రమాదేవీ (Ranirudrama) పేరు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయంలో మేము కూడా కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. నేరాల శాతం 20 శాతం పెరిగాయని డీజీపీ వెల్లడించారు. ఆడబిడ్డలకు రక్షణపై ప్రభుత్వం సమీక్షించి ప్రకటన చేయాలన్నారు. కేసీఆర్ కిట్ పంపిణీని నిలిపివేసి కాంగ్రెస్ పార్టీ మానవత్వాన్ని మంటకలిపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను పెచాలన్నారు. మహిళా కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి అవసరమైన సదుపాయాలు కల్పించడం లేదు. మహిళా కార్మికులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణను ప్రకటించాలన్నారు. అంగన్ వాడీ కార్మికుల జీతాలను పెంచుతామని హామీ ఇచ్చిన విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఢాంబికాలు పలుకుతోందన్నారు. కేసీఆర్ హయాంలోనే ఆ పోస్టులను సృష్టించారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆడపిల్లలకు ఫీజు రియింబర్స్ మెంట్ చేయడం లేదదన్నారు.