సొంత ఆర్భాటాల కోసం ప్రజాధనం వృథా.. ఖంగుతినేలా చేస్తోన్న కేసీఆర్ ఖర్చులు?
ప్రగతిభవన్ నిర్మాణ సమయంలోనే చాలా విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ పాలకులు సొంత ఆర్భాటాల కోసం విచ్చలవిడిగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలూ వచ్చాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రగతిభవన్ నిర్మాణ సమయంలోనే చాలా విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ పాలకులు సొంత ఆర్భాటాల కోసం విచ్చలవిడిగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలూ వచ్చాయి. ప్రస్తుతం పదేండ్లలో ప్రగతిభవన్ ఖర్చులపై అధికారులు ఆరా తీస్తుంటే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయని ఆ వర్గాల సమాచారం. ‘భవన్’ ఆవరణలో రూ.2 కోట్ల వ్యయంతో బ్యాడ్మింటన్ కోర్టును నిర్మించారని, మొన్నటివరకు దాని నిర్వహణ కోసం మరో రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్టు టాక్. రూ.12 లక్షలు ఖర్చు చేసి ఆధునిక వసతులతో కుక్కల షెడ్డును సైతం నిర్మించారని తెలిసింది. ముగ్గుపోసినప్పుడు రూ.60 కోట్లు అనుకున్న ప్రగతిభవన్ నిర్మాణ అంచనా వ్యయం.. పూర్తయ్యే సరికి రూ.200 కోట్లు దాటిందని అధికారులు చెబుతున్నారు. రూ.25 కోట్లు ఖర్చుచేసి ఇటలీ నుంచి ఫర్నిచర్ సైతం తెప్పించినట్టు టాక్. బీఆర్ఎస్ హయాంలో ‘భవన్’ నిర్మాణం విషయంలో ఫైల్ ఉదయం వస్తే, సాయంత్రంలోగా దానిని క్లియర్ చేయాలని ఒత్తిడి పెట్టేవారని ఆఫీసర్లలో టాక్ ఉంది. ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ప్రతిపాదనలు సరిగా ఉన్నాయా? లేవా? అని క్రాస్ చెక్ చేసే టైమ్ కూడా ఇచ్చేవారు కాదనే ఆవేదన ఆఫీసర్లు వ్యక్తం చేసినట్టు సమాచారం. చాలా విషయాల్లో ముందుగా అనుమతి లేకుండా ఖర్చు చేసి, ఆ తర్వాత పరిపాలన అనుమతులు తీసుకున్నట్టు తెలుస్తున్నది.
పోలీసు పహరా ఉండగా కుక్కలు ఎందుకు?
గతేడాది డిసెంబర్ 5 వరకు ప్రగతిభవన్ చుట్టూ రాత్రింబవళ్లు పోలీసు పహారా ఉండేది. అనుమతి లేనిదే ఎవరినీ లోనికి పంపేవారు కాదు. కానీ నాటి సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు మాత్రం నాలుగు కుక్కలను పెంచుకున్నారు. వాటి రక్షణ కోసం ప్రగతిభవన్ ఆవరణలో సుమారు రూ.12 లక్షలు ఖర్చు పెట్టి షెడ్డు నిర్మించినట్టు లెక్కల్లో బహిర్గమైనట్టు సమాచారం. అంత ఖర్చు పెట్టి షెడ్డు నిర్మించారా? లేక తప్పుడు లెక్కలు చూపారా? అనే కోణంలో ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు.
రూ.2 కోట్లతో బ్యాడ్మింటన్ కోర్టు
కేసీఆర్ తన కుటుంబసభ్యుల కోసం బ్యాడ్మింటన్ కోర్టు నిర్మించారని, అందుకు దాదాపుగా రూ.2 కోట్లు ఖర్చయినట్టు లెక్కల్లో చూపారని, ఇప్పటి వరకు ఆ కోర్టు నిర్వహణ కోసం మరో రూ.2.5 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం జరుగుతున్నది. ప్రజల కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు పరిస్థితిని పట్టించుకోని కేసీఆర్.. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కోసం మాత్రం రూ.కోట్లు ఖర్చు చేసి బ్యాడ్మింటన్ కోర్టు నిర్మించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇటలీ నుంచి ఫర్నిచర్
ఇటలీ దేశం నుంచి రూ.25 కోట్లు ఖర్చు చేసి ఫర్నిచర్ తెప్పించారని, ఈ పక్రియ అంతా బీఆర్ఎస్ పాలకుల సన్నిహితుల ద్వారా జరిగినట్టు సమాచారం. టెండర్ లేకుండా రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేయడం అప్పట్లో అధికారుల మధ్య వివాదానికి దారి తీసినట్టు తెలిసింది. ఫర్నీచర్ కొనుగోలు అంశాన్ని అంచనాలో పేర్కొనలేదని, అందుకే ఆ ఖర్చును తాము భరించలేమని ఆర్ అండ్ బీ శాఖ అప్పట్లో స్పష్టం చేసింది. కానీ, ‘ఆ ఖర్చును మీ ఖాతా నుంచి చెల్లించండి, అందుకు కావాల్సిన ఫైల్ రెడీ చేసి, సంతకం పెట్టండి’ అని ఓ జీఏడీ అధికారిపై నాటి సీఎస్ ఒత్తిడి తెచ్చారు. టెండర్ లేకుండా, నామినేషన్ పద్దతిలో చేసిన ఖర్చుకు అనుమతి ఇవ్వలేనని సదరు అధికారి తేల్చిచెప్పారు. దీనితో ఆ ఆఫీసర్‌పై బదిలీ వేటు వేశారని సెక్రటేరియట్ వర్గాల్లో టాక్. చివరికి ఆ ఖర్చును ఓ ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా కొనుగోలు చేసి, ప్రగతిభవన్‌లో సమకూర్చినట్టుగా ఫైల్ రెడీ చేసి కథను ముగించారని తెలుస్తున్నది.