కరోనా వారియర్స్‌ను వదలని కమీషన్ రాయుళ్లు.. ముడుపులు ఇవ్వకపోతే ఫైల్ ముందుకు కదిలేదే లేదు!

''సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ అంగన్​వాడీ ఆయమ్మ కరోనాతో 2020లో చనిపోయారు.

Update: 2023-02-10 00:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ''సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ అంగన్​వాడీ ఆయమ్మ కరోనాతో 2020లో చనిపోయారు. ప్యాండమిక్​ సిచ్వేషన్‌లో డ్యూటీ చేస్తున్న క్రమంలో ఆమెకు వైరస్​అంటుకొని ఆరోగ్యం విషమించి మృతి చెందారు. దీంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని (ప్రధాన మంత్రి గరీబ్​కల్యాణ్​ఫ్యాకేజీ) నేషనల్​ ఇన్సురెన్స్​అథారిటీ స్కీమ్​ కొరకు 2021 ఏడాది చివర్లో అప్లై చేశారు. కానీ ఇప్పటి వరకు ఆమెకు స్కీమ్​అందలేదు. జిల్లా వైద్యశాఖ కార్యాలయం, కోఠిలోని ఆరోగ్యశాఖ కార్యాలయాలకు ఆమె కొడుకు అనేక సార్లు తిరిగాడు. కానీ తమ చేతిలో ఏమీ లేదని, ఢిల్లీ నుంచి అప్రూవల్ కావాల్సి ఉంటుందని ఆఫీసర్లు చేతులెత్తేశారు. దరఖాస్తు చేసి రెండేళ్లు గడుస్తున్నా.. హెల్త్ కేర్​వర్కర్లకు కేంద్రం ఇచ్చే నష్ట పరిహారం ఇప్పటి వరకు అందకపోవడం బాధాకరం. ప్రస్తుతం ఆ స్కీమ్ అప్లై గడువును కూడా క్లోజ్​చేశారు. ఇదే సిద్ధిపేట్ జిల్లాలో కొవిడ్‌తో మరణించిన మరొక హెల్త్ కేర్​వర్కర్​కూడా ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేశారు. కానీ వాళ్లకీ అందలేదు. స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం బాధాకరమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు''

కరోనా ప్రపంచ వ్యాప్తంగా దడలు పుట్టించింది. అయితే కరోనా వైరస్‌పై హెల్త్ కేర్​వర్కర్లు నిర్వీరామంగా పోరాడారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా వేల మంది మరణించారు. మన రాష్ట్రంలో కూడా వందల మంది మృతి చెందారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌తో చనిపోయిన హెల్త్ కేర్​వర్కర్లకు నేషనల్​ఇన్సురెన్స్​అథారిటీ కింద రూ. 50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నది. ఈ ప్రాసెస్‌ను మానిటరింగ్ చేయాలని రాష్ట్ర వైద్యశాఖకు అప్పగిస్తూ, బాధితులను ఎంపిక చేయాలని కేంద్రం సూచించింది. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలిచ్చిన తర్వాత బాధితుల కుటుంబ సభ్యులు ఈ స్కీమ్​కొరకు అప్లై చేశారు. కానీ కొందరికీ వేగంగా క్లైమ్‌లు కాగా, మరి కొందరికి ఇప్పటికీ కాలేదు. దీంతో చాలా మంది బాధితులు జిల్లా కలెక్టరేట్లు, హైదరాబాద్​కోఠిలోని ఆరోగ్యశాఖ కార్యాలయం చూట్టూ తిరుగుతూనే ఉన్నారు.

స్టేట్​నుంచి 174 మంది దరఖాస్తు..

మన రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం హెల్త్ కేర్​వర్కర్లకు ఇచ్చే కొవిడ్​నష్ట పరిహారం కోసం 174 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటి వరకు 143 మందికి ఇన్సురెన్స్​క్లైమ్​అయింది. మిగతా వారికి ఇప్పటి వరకు కాలేదు. ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించినా సంబంధిత అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదని బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. ఇలా ఎన్నాళ్లు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాలని మరణించిన హెల్త్​కేర్​వర్కర్ల కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఇక్కడే అసలైన ట్రిక్.. కమీషన్లు ఇస్తే అంతా ఫాస్ట్..

కొవిడ్‌తో మరణించి హెల్త్ కేర్​వర్కర్లు ఒక్కోక్కరికీ రూ. 50 లక్షలను కేంద్రం ఇస్తోన్నది. దీన్ని అసరా చేసుకొని రాష్ట్ర వైద్యశాఖ పరిధిలోని కొవిడ్​ఇన్సురెన్స్​ విభాగంలోని ఓ అధికారి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ముడుపులు చెల్లించినోళ్లకు వేగంగా క్లైమ్​అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మండిపడుతున్నారు. తమ కంటే ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నోళ్లకు కూడా ఇన్సురెన్స్​డబ్బులు వచ్చాయని సిద్దిపేట్ జిల్లాకు చెందిన అంగన్​వాడీ ఆయమ్మ కొడుకు 'దిశ'కు తెలిపారు. ఈ ఇన్సురెన్స్​ స్కీమ్ అప్రూవల్స్​కోసం మధ్యవర్తులు కూడా ముడుపులు కోసం ప్రయత్నించారని, కానీ తాను ఎలాంటి కమీషన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్లు వివరించారు. అందుకే తన తల్లి ఇన్సురెన్స్​ఆగిపోయి ఉంటుందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ సమస్య కొవిడ్​ఇన్సురెన్స్​కొరకు అప్లై చేసిన వారందరికీ ఎదురవుతున్నది. ఇప్పటి వరకు ఇన్సురెన్స్​క్లైమ్​చేసుకున్న 143 మందిలో 40 శాతం మంది కమీషన్లు ఇచ్చినట్లు వైద్యశాఖలోనే చర్చ జరుగుతున్నది. కొందరు అధికారుల అండడండలతో చైన్​సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకొని డబ్బులు ఇచ్చినోళ్లకే స్కీమ్​అప్రూవల్​ అయ్యేలా చొరవ చూపుతున్నారు. కొందరి దగ్గర రూ. 2 లక్షలు, మరి కొందరి దగ్గర ఐదు లక్షలు అంత కంటే ఎక్కువ కూడా కమీషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కొందరు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో పనిచేసే స్టాఫ్​'రూ. 50 లక్షలు వస్తున్నాయి కదా? ఎంతో కొంత ఇవ్వలేరా?' అంటూ దబాయించి మరీ తీసుకుంటున్నట్లు బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. అన్ని జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే ఎదురవుతున్నది. కరోనాతో మరణించోళ్ల డబ్బుల్లోనూ వైద్యశాఖలోని కొందరు స్టాఫ్, మధ్యవర్తులు తీసుకోవడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మంత్రి హరీష్​రావు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కొవిడ్ ఇన్సురెన్స్‌లపై ఎంక్వైరీ చేపించాలని స్వయంగా వైద్యశాఖ సిబ్బందే కోరుతున్నారు. 

ఇవి కూడా చదవండి : కరోనా భయమేనా? తెరుచుకోని బల్దియా పార్కుల క్యాంటీన్‌లు

Tags:    

Similar News