Kushboo :నేను కాదు..నా తండ్రే సిగ్గుపడాలి.. మరోసారి ఖుష్భూ సంచలన వ్యాఖ్యలు
సొంత తండ్రి వల్ల తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ ఇటీవల ఖుష్బూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : సొంత తండ్రి వల్ల తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ ఇటీవల సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తాజాగా ఆమె స్పందించారు. తనకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి చెప్పినందుకు తాను ఏమాత్రం సిగ్గుపడటంలేదన్నారు. ‘నాకు జరిగిన అన్యాయాన్ని ధైర్యం చేసి నిజాయతీగా అందరికీ తెలిసేలా చేశాను.
ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. అలాగే ఆ విషయాన్ని చెప్పినందుకు నేనేమీ సిగ్గుపడటం లేదు. నాపై ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తి సిగ్గుపడాలి. అలాగే మహిళలందరూ ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. మిమ్మల్ని కించపరిచే వాటిని ప్రోత్సహించకూడదు. నాకు జరిగిన దారుణాన్ని అందరితో చెప్పడానికి సమయం తీసుకొని ఉండొచ్చు.
అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ తమకు ఎదురైన వేధింపులను వెల్లడించి.. తమ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా’ అని ఆమె వివరించారు. కాగా, ఇటీవల ఝార్ఖండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో నటి ఖుష్బూ మాట్లాడారు. ‘మా నాన్న వల్ల అమ్మ జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంది. అమ్మను, నన్ను కొట్టేవాడు. నాకు 8 ఏళ్లప్పుడే లైంగికంగా వేధించాడు. 15 ఏళ్ల వయస్సులో ఆయన్ను ఎదురించే ధైర్యం వచ్చింది. ఆపైన ఉన్నవన్నీ తీసేసుకుని మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు’ అని చెప్పారు.
Read more:
Khushboo: ఆ విషయం చెప్పినందుకు నేను సిగ్గుపడట్లేదు: తండ్రి వేధింపులపై నటి