తొలిరోజే ఆ పార్టీ జోరు.. ముగ్గురు కీలక నేతల నామినేషన్లు

తెలంగాణలో నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది.

Update: 2024-04-18 09:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బిహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జమ్మూకశ్మీర్‌‌తోపాటు తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బై ఎలక్షన్ జరగబోతున్నది. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అసలు యుద్ధం మొదలు కాబోతున్నది. ఎత్తుకు పై ఎత్తులతో రాజకీయం మరింత రంజుగా మారబోతున్నది.

25 వరకు నామినేషన్లు...

తెలంగాణలో నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది.ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్లను పరిశీలించనున్నారు. 29 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ చేపట్టనున్నారు. కాగా తెలంగాణలో తొలిరోజే కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ల పత్రాలు సమర్పించారు. కాగా ఎంపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనా ఇంకా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు.

Tags:    

Similar News